Jharkhand Violence: 50 మంది అరెస్టు, రంగంలోకి డ్రోన్లు
ABN , First Publish Date - 2023-04-10T17:11:42+05:30 IST
జార్ఖాండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ప్రమేయమున్నట్టు..
జంషెడ్‌పూర్: జార్ఖాండ్‌లోని (Jharkhand) జంషెడ్‌పూర్‌లో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో (Violence) ప్రమేయమున్నట్టు భావిస్తున్న 50 మందికి పైగా అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒక వర్గానికి చెందిన మతపరమైన జెండాను అపవిత్రం చేశారనే కారణంగా ఆదివారంనాడు జంషెడ్‌పూర్‌లోని శాస్త్రినగర్ ప్రాంతంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పాటు దహనకాండలు చోటుచేసుకున్నాయి. ఆస్తుల విధ్వంసానికి అల్లరిమూకలు పాల్పడ్డాయి. దీంతో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
''అల్లర్లకు పాల్పడిన కేసులో ఇరువర్గాలకు చెందిన 55 మందిని అరెస్టు చేశాం. అభయ్ సింగ్ అనే ఒక వ్యక్తిని కూడా అదుపులోనికి తీసుకున్నాం. అతని మద్దతుదారులుగా భావిస్తున్న కొందరు పోలీస్ స్టేషన్‌కు వచ్చి, అనుచితంగా ప్రవర్తించారు. వారిపై కూడా చర్యలు తీసుకుంటాం'' అని జంషెడ్‌పూర్ సిటీ ఎస్పీ కె.విజయ్ శంకర్ తెలిపారు. అల్లర్లు జరిగిన ప్రాంతంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో పాటు భారీగా పోలీసు బలగాలను, డ్రోన్లతో నిఘా టీమ్‌లను రంగంలోకి దింపినట్టు సిటీ సీనియర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. కాగా, యథాపూర్వ పరిస్థితి తీసుకు వచ్చేందుకు శాంతి కమిటీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు డిప్యూటీ కమిషన్ విజయ్ జాదవ్ చెప్పారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మరాదని, రెచ్చగొట్టే మెసేజ్‌లు వస్తే పోలీసులకు సమాచారం అందచేయాలని ఆయన కోరారు.