Karnataka: విరూపాక్షప్పతో కమలనాథులకు తప్పని తిప్పలు
ABN , First Publish Date - 2023-03-27T20:14:41+05:30 IST
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ వ్యవహారం తలనొప్పిగా మారడంతో కమలనాథులు తలలు పట్టుకున్నారు.
బెంగళూరు: కర్ణాటక సోప్స్ అండ్ డిటెర్జెంట్స్ లిమిటెడ్ కుంభకోణంలో (KSDL corruption case) హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన బీజేపీ ఎమ్మెల్యే మాడాళ్ విరూపాక్షప్పను (BJP MLA Madal Virupakshappa) మళ్లీ అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణంలో భారీగా ముడుపులు పొందారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని కర్ణాటక(Karnataka) లోకాయుక్త (Lokayukta) మళ్లీ సవాల్ చేసింది. దీంతో ఆయన యాంటిసిపేటరీ బెయిల్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో విరూపాక్షప్పను మళ్లీ అరెస్ట్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే మాడాళ్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ రూ.40లక్షల లంచం తీసుకుంటుండగా మార్చి 2న లోకాయుక్త పోలీసులు మెరుపుదాడులు నిర్వహించి పట్టుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే నివాసాల్లోనూ లోకాయుక్త పోలీసులు సోదాలు జరపగా రూ.8.23 కోట్ల మేరకు నగదు లభించింది.
ప్రశాంత్ బెంగళూరు వాటర్ సప్లయ్ అండ్ సెవరేజ్ బోర్డ్ (Bangalore Water Supply & Sewerage Board)లో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. విరూపాక్షప్ప కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) చైర్మన్‌గా వ్యవహరించేవారు. ఈ కంపెనీకి కెమికల్ ఆయిల్ సరఫరా టెండరు మంజూరు కోసం ప్రశాంత్ ఓ సంస్థ నుంచి రూ.40 లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు పట్టుకున్నారు. దీంతో విరూపాక్షప్ప కేఎస్‌డీఎల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆచూకీ లేకుండా పోయారు. కర్ణాటక హైకోర్టులో ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు చేశారు. ముందస్తు బెయిలు మంజూరవడంతో ఈ నెల 7న అట్టహాసంగా తన అనుచరులతో కలిసి తన నియోజకవర్గం చన్నగిరికి వెళ్లారు. ముందస్తు బెయిలు పొందిన తర్వాత విరూపాక్షప్ప భారీ ప్రదర్శనతో తన నియోజకవర్గానికి వెళ్ళడాన్ని బీజేపీ హై కమాండ్ తప్పుబట్టింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ వ్యవహారం తలనొప్పిగా మారడంతో కమలనాథులు తలలు పట్టుకున్నారు.