Siddaramaiah, DK to Delhi: హస్తినకు మళ్లీ సిద్ధూ, డేకే..ఈసారి ఎందుకంటే..?
ABN , First Publish Date - 2023-05-24T12:09:47+05:30 IST
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మళ్లీ హస్తినకు పయనమవుతున్నారు. బుధవారం సాయంత్రం వీరు ఢిల్లీకి వెళ్తారని, కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిసి మంత్రివర్గ విస్తరణ, ప్రస్తుతం క్యాబినెట్‌లోకి తీసుకున్న మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చించనున్నారని తెలుస్తోంది.
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) మళ్లీ హస్తినకు పయనమవుతున్నారు. బుధవారం సాయంత్రం వీరు ఢిల్లీకి వెళ్తారని, కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిసి మంత్రివర్గ విస్తరణ, ప్రస్తుతం క్యాబినెట్‌లోకి తీసుకున్న మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చించనున్నారని తెలుస్తోంది.
సీఎంఓ షెడ్యూల్ ప్రకారం, సిద్ధరామయ్య ప్రత్యేక విమానంలో సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. రాత్రి ఢిల్లీలోనే ఉంటారు. శివకుమార్ కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం సిద్ధరామయ్యతో డీకే కూడా వెళ్తున్నారు. సిద్ధరామయ్య సీఎంగా, డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఈనెల 20న బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేశారు. వీరితో పాటు 8 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ముందస్తు ఆలోచన ప్రకారం, తొలి క్యాబినెట్‌లోనే మరింత మందిని తీసుకోవాలని ఢిల్లీలో జరిగిన గత చర్చల్లో ఆలోచన చేసినప్పటికీ, కొందరి పేర్ల విషయంలో సిద్ధరామయ్యకు, డీకేకు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయని, దీంతో 8 మందిని మాత్రమే క్యాబినెట్‌లో తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, మంత్రివర్గ విస్తరణలో అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలకు సమప్రాధాన్యం కల్పిండం అనేది ప్రస్తుతం సిద్ధరామయ్య ముందున్న కీలక సవాలుగా చెప్పుకోవచ్చు. 34 మందికి క్యాబినెట్‌లో అవకాశం ఉండగా, మంత్రివర్గంలో చోటును ఆశిస్తున్న వారి సంఖ్య అంతకంటే ఎక్కువగా ఉంది.