Karnataka : టీటీడీకి కర్ణాటక డెయిరీ ‘నందిని’ షాక్
ABN , First Publish Date - 2023-08-01T11:30:04+05:30 IST
తిరుమల-తిరుపతి దేవస్థానానికి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఝలక్ ఇచ్చింది. ‘నందిని’ బ్రాండ్ నెయ్యిని ఈ దేవస్థానానికి సరఫరా చేయరాదని నిర్ణయించింది. ధరకు సంబంధించిన సమస్య వల్ల టెండరు ప్రక్రియలో పాల్గొనరాదని నిర్ణయించింది. రైతుల ప్రయోజనాల కోసం ఏర్పాటైన తమ సంస్థ చౌక ధరకు నెయ్యిని సరఫరా చేసి, నష్టపోవడం శ్రేయస్కరం కాదని భావించింది.
బెంగళూరు : తిరుమల-తిరుపతి దేవస్థానానికి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఝలక్ ఇచ్చింది. ‘నందిని’ బ్రాండ్ నెయ్యిని ఈ దేవస్థానానికి సరఫరా చేయరాదని నిర్ణయించింది. ధరకు సంబంధించిన సమస్య వల్ల టెండరు ప్రక్రియలో పాల్గొనరాదని నిర్ణయించింది. రైతుల ప్రయోజనాల కోసం ఏర్పాటైన తమ సంస్థ చౌక ధరకు నెయ్యిని సరఫరా చేసి, నష్టపోవడం శ్రేయస్కరం కాదని భావించింది.
కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎమ్‌డీ జగదీశ్ మాట్లాడుతూ, టెండర్లను పిలిచినపుడు ప్రతివారూ పాల్గొంటారని, ఒకటి లేదా రెండు రూపాయలు తక్కువ కోట్ చేసినవారికి టెండరు మంజూరవుతోందని చెప్పారు. తాము కేజీ నెయ్యికి రూ.400కుపైగా కోట్ చేశామన్నారు. అంతకన్నా తక్కువకు కోట్ చేసేవారు నెయ్యిని ఎక్కడ, ఏ ధరకు కొంటారో తమకు తెలియదన్నారు. తమ సంస్థ రైతుల ప్రయోజనాల కోసం ఉందన్నారు. అందువల్ల తక్కువ ధరకు కోట్ చేస్తే నష్టాలు వస్తాయని, ఆచరణ సాధ్యం కాదని చెప్పారు.
టెండరు ప్రక్రియలో పాల్గొనాలని ఓ ఏడాది క్రితం టీటీడీ తమను కోరిందని చెప్పారు. కానీ పోటీ ధరలకు తాము నెయ్యిని సరఫరా చేయలేమని తెలిపారు. తాము నిర్ణయించిన ధరకు మాత్రమే సరఫరా చేయగలమని చెప్పామని, అందుకు టీటీడీ తిరస్కరించిందని చెప్పారు. అందుకే తాము టీటీడీకి నెయ్యిని సరఫరా చేయడం లేదని చెప్పారు.
టీటీడీ ఈవో ధర్మా రెడ్డి మాట్లాడుతూ, కేఎంఎఫ్ వాదనను తోసిపుచ్చారు. తాము ఈ-టెండర్ల ద్వారా మాత్రమే సరుకులను కొంటామని తెలిపారు. నెయ్యిని సరఫరా చేయడానికి టీటీడీ అవకాశం ఇవ్వడం లేదని కేఎంఎఫ్ ప్రెసిడెంట్ చెప్తున్నారని, అది సరికాదని అన్నారు. ఈ-టెండర్లను తెరిచే వరకు టెండర్లు ఎవరు వేశారో తమకు తెలియదన్నారు.
ఇవి కూడా చదవండి :
Nuh violence : హర్యానాలో మత ఘర్షణలు.. ఇద్దరు హోం గార్డులు సహా ముగ్గురి మృతి..
BJP : ఎన్డీయే స్వార్థం చూసుకోదు : మోదీ