Karnataka : ఎన్నికల్లో తాయిలాలకు బదులు ఇలా చేయండి : డాక్టర్ల సలహా

ABN , First Publish Date - 2023-03-22T10:27:50+05:30 IST

కర్ణాటక శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య రంగ నిపుణులు రాజకీయ పార్టీలకు ఓ సలహా ఇచ్చారు.

Karnataka : ఎన్నికల్లో తాయిలాలకు బదులు ఇలా చేయండి : డాక్టర్ల సలహా
Karnataka Doctors

బెంగళూరు : కర్ణాటక శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య రంగ నిపుణులు రాజకీయ పార్టీలకు ఓ సలహా ఇచ్చారు. రకరకాల తాయిలాలను ఉచితంగా ఇస్తామని హామీలు ఇవ్వడం కన్నా ప్రజలకు బ్లడ్ సుగర్, బ్లడ్ ప్రెషర్, మూత్రం, క్రియాటినైన్ వంటి పరీక్షలను ఉచితంగా చేయించాలని చెప్పారు. ఈ పరీక్షల వల్ల జీవనశైలి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడానికి వీలవుతుందని తెలిపారు.

భారత దేశంలో మధుమేహం అధ్యయనం కోసం కర్ణాటక పరిశోధన సమాజం అధ్యక్షుడు డాక్టర్ కేఎన్ మనోహర్ మాట్లాడుతూ, మూత్రపిండాల సంబంధిత వ్యాధులకు అతి పెద్ద కారణం మధుమేహం అని చెప్పారు. మధుమేహం వల్ల బాధపడుతున్నవారి సంఖ్య చైనా తర్వాత మన దేశంలోనే అధికంగా ఉందన్నారు. రక్తం, సుగర్ లెవెల్స్‌ను క్రమం తప్పకుండా పరిశీలించడం చాలా ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాలుగు పరీక్షలకు కలిపి రూ.500 వరకు ఖర్చవుతుందని, ఎక్కువ మందికి ఏక కాలంలో ఈ పరీక్షలు చేయిస్తే ఖర్చు మరింత తగ్గవచ్చునని చెప్పారు.

కిడ్నీ వారియర్స్ అసోసియేషన్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మెడికల్ ప్రొఫెషనల్స్ ఇదే విషయాన్ని ప్రముఖంగా వివరించారు. కార్డియాక్ అరెస్ట్, కిడ్నీ ఫెయిల్యూర్, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్ వంటివి ఒకదానితో మరొకటి సంబంధం కలవని చెప్పారు. ఇవి జీవనశైలి వ్యాధులని తెలిపారు. వీటిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే, ప్రమాదాలను నివారించవచ్చునని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Delhi Liquor Policy: సౌత్‌గ్రూపు నిర్దేశించినట్లుగా.. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ

Supreme Court: ‘ఉరి’కి ప్రత్యామ్నాయం లేదా?

Updated Date - 2023-03-22T10:27:50+05:30 IST