Karnataka Assembly Elections: శెట్టర్‌కు టికెట్ దక్కేనా? లేక రెబల్ అభ్యర్థిగా పోటీయా?

ABN , First Publish Date - 2023-04-12T18:53:53+05:30 IST

కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్‌ (Jagadish Shettar) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో (BJP president JP Nadda) ఢిల్లీలో సమావేశమయ్యారు. తన వాదన వినిపించారు.

Karnataka Assembly Elections: శెట్టర్‌కు టికెట్ దక్కేనా? లేక రెబల్ అభ్యర్థిగా పోటీయా?
Karnataka former CM Jagadish Shettar meets BJP president JP Nadda

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) వేళ ధిక్కార స్వరం వినిపించిన కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్‌ (Jagadish Shettar) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో (BJP president JP Nadda) ఢిల్లీలో సమావేశమయ్యారు. తన వాదన వినిపించారు. తన పాపులారిటీ బాగుందని, సర్వేల్లో కూడా ఇది స్పష్టమైందన్నారు. తాను ఒక్క ఎన్నికల్లో కూడా ఓడిపోలేదన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణమే లేదన్నారు. తాజా ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలని కోరారు. హుబ్బళ్లి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శెట్టర్ గత ఎన్నికల్లో 21 వేల ఓట్ల తేడాతో గెలిచారు. వాస్తవానికి తాను ఇప్పటికే తన నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించానని, ఎన్నికలకు దూరం కాలేనని ఆయన హైకమాండ్‌కు స్పష్టం చేశారు. అయితే తాను పరిశీలిస్తానని నడ్డా హామీ ఇచ్చారని శెట్టర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. మరికాసేపట్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల రెండో జాబితా విడుదల కానుంది. ఈ తరుణంలో రెండో జాబితాలో శెట్టర్‌కు చోటు దక్కుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే శెట్టర్‌కు పార్టీ టికెట్ లభించే అవకాశం ఉందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప(former Karnataka CM, BS Yediyurappa) ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్పను (KS Eshwarappa) బీజేపీ హై కమాండ్ దారిలోకి తెచ్చుకోగలిగింది. తాను ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ఈశ్వరప్ప ప్రకటించారు.

బీజేపీ నిన్న విడుదల చేసిన 189 మంది జాబితాలో సీఎం బసవరాజ్‌ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర పేర్లు కూడా ఉన్నాయి. 52 మంది కొత్త అభ్యర్థులకు అవకాశమిచ్చారు. 8 మంది మహిళలకు చోటిచ్చారు. 189 టికెట్లలో 32 ఓబీసీలకు, 30 ఎస్సీలకు, 16 ఎస్టీలకు ఇచ్చారు. వరుణలో సిద్దూతో మంత్రి వి.సోమన్న తలపడనున్నారు. అలాగే కనకపురలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై మరో మంత్రి ఆర్‌.అశోక బరిలోకి దిగనున్నారు. ఇక సీఎం బొమ్మై తన సొంత నియోజకవర్గం శిగ్గావ్‌లో, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి చిక్‌మగళూర్‌లో, రాష్ట్ర మంత్రి బి.శ్రీరాములు బళ్లారి రూరల్‌లో, గాలి జనార్దనరెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్‌రెడ్డి బళ్లారి సిటీలో బరిలోకి దిగనున్నారు. హిజాబ్‌ వివాదం తలెత్తిన ఉడుపిలో ప్రస్తుత ఎమ్మెల్యే రఘుపతి భట్‌ స్థానంలో యశ్‌పాల్‌ సువర్ణకు అవకాశమిచ్చారు.

కాంగ్రెస్ ఇప్పటివరకూ 165 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జేడీఎస్ 97 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించింది.

కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Updated Date - 2023-04-12T18:53:56+05:30 IST