Karnataka : యూరోపియన్ స్టైల్ బస్సు ప్రయాణాన్ని ఆస్వాదించడానికి సిద్ధంకండి!
ABN , First Publish Date - 2023-02-21T17:09:33+05:30 IST
ప్రయాణికులకు సౌకర్యంతోపాటు ఆహ్లాదాన్ని అందించడానికి కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) సన్నాహాలు చేస్తోంది.
బెంగళూరు : ప్రయాణికులకు సౌకర్యంతోపాటు ఆహ్లాదాన్ని అందించడానికి కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 24 నుంచి ప్రయాణికులు అత్యంత సౌకర్యవంతంగా, యూరోపియన్ స్టైల్‌లో ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తోంది. అంబారీ ఉత్సవ్ పేరుతో బెంగళూరు నుంచి వివిధ నగరాలకు ఈ బస్సులను అందుబాటులోకి తెస్తోంది. ఇవి ఎయిర్-కండిషన్డ్ స్లీపర్ బస్సులు. అయితే టికెట్ ఖరీదు కాస్త ఎక్కువగానే ఉంటుంది.
అంబారీ ఉత్సవ్ పేరుతో ప్రయాణికులకు 15 వోల్వో 9600s మల్టీ యాక్సిల్ స్లీపర్ బస్సులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తెస్తోంది. ఇవి బెంగళూరు నుంచి మంగళూరు, కుందపుర, పనజీ, పుణే, హైదరాబాద్, సికింద్రాబాద్, ఎర్నాకుళం, త్రిసూర్, తిరువనంతపురం నగరాలకు రాకపోకలు సాగిస్తాయి. ఒక్కొక్క బస్సులో 40+2 సీట్లు ఉంటాయి.
ఈ బస్సులో ప్రయాణించేవారికి విమానంలో విలాసవంతంగా ప్రయాణించిన అనుభూతి కలుగుతుందని కేఎస్ఆర్‌టీసీ అధికారులు తెలిపారు. ఈ విలాసవంతమైన బస్సు ప్రయాణానికి అంబారీ ఉత్సవ్ అనే పేరును ప్రజాభిప్రాయం ఆధారంగా ఎంపిక చేశామని తెలిపారు. బెంగళూరు నుంచి సుదూర ప్రాంతాలకు నాజూకైన, ఆధునిక, సౌకర్యవంతమైన బస్సులను నడుపుతున్న ప్రైవేట్ సంస్థలతో పోటీపడాలనే లక్ష్యంతో అంబారీ ఉత్సవ్‌ను చేపట్టినట్లు తెలిపారు.
అంబారీ ఉత్సవ్ (Ambaari Utsav) విశేషాలు :
- ఇది వోల్వో 9600s మల్టీ యాక్సిల్ స్లీపర్ బస్సు. దీని పొడవు 15 మీటర్లు, ఎత్తు 4 మీటర్లు, వెడల్పు 2.6 మీటర్లు.
- దీనిలో బెర్త్ సైజు 5.9 అడుగులు
- అంబారీ ఉత్సవ్ టికెట్ ధర ఒక్కొక్కరికి అంబారీ డ్రీమ్ క్లాస్ Volvo B11R స్లీపర్ బస్ టికెట్ ధర కన్నా 13 శాతం ఎక్కువ
- అంబారీ డ్రీమ్ క్లాస్ టికెట్ ధర బెంగళూరు నుంచి మంగళూరుకు రూ.1,151, కాగా హైదరాబాద్‌కు రూ.1,638.
- అంబారీ ఉత్సవ్ బస్సు ప్రయాణం చాలా సదుపాయంగా, సురక్షితంగా ఉంటుంది.
- కేరళకు వెళ్లాలంటే అంబారీ ఉత్సవ్ బస్సులు శాంతి నగర్ వద్ద అందుబాటులో ఉంటాయి. ఇతర నగరాలకు వెళ్లేవారు మెజెస్టిక్ నుంచి ప్రయాణించవచ్చు.
ఇవి కూడా చదవండి :
Tomatoes: యూకే సూపర్‌మార్కెట్లలో టమాటా స్టాకులు ఖాళీ.. ఏంటా అని కారణాలు అన్వేషించగా...
Rahul Gandhi : భారత్‌లో ఫాసిజం : రాహుల్ గాంధీ