Lok sabha Elections 2024: సంచలన ప్రకటన చేసిన ఆర్జేడీ, జేఎంఎం

ABN , First Publish Date - 2023-02-12T19:15:41+05:30 IST

రాష్ట్రీయ జనతాదళ్, జార్ఖాండ్ ముక్తి మోర్చా సంయుక్తంగా ఆదివారంనాడు సంచలన ప్రకటన చేశాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో...

Lok sabha Elections 2024: సంచలన ప్రకటన  చేసిన ఆర్జేడీ, జేఎంఎం

రాంచీ: రాష్ట్రీయ జనతాదళ్ (RJD), జార్ఖాండ్ ముక్తి మోర్చా (JMM) సంయుక్తంగా ఆదివారంనాడు సంచలన ప్రకటన చేశాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తాము కలిసి పని చేస్తాయమని ప్రకటించాయి. జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఆయన నివాసంలో ఆర్జేడీ నేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కలుసుకున్నారు. సమావేశానంతరం ఇరు పార్టీల నేతలు సంయుక్త ప్రకటన చేశారు.

''మేము (ఆర్జేడీ, జేఎంఎం) కలిసి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం. ఆమధ్యన జార్ఖాండ్‌కు వచ్చి పార్టీ పనితీరు చూడాలని అనుకున్నాను. కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. లాలూజీకి కిడ్నీ మార్పిడి చికిత్స విజయవంతమై ఈరోజు ఇంటికి తిరిగి వస్తున్నారు. బీహార్‌లో బీజేపీని అధికారంలోంచి తప్పించాం. మహాఘట్‌బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఈ కారణాలతో జార్ఖాండ్ రాలేకపోయాను'' అని తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. జార్ఖాండ్‌లో బీజేపీని మట్టికరిపించేందుకు తమ రెండు పార్టీలు బలంగా నిలబడి గట్టి పోటీ ఇవ్వాలనుకుంటున్నామని చెప్పారు. బీహార్, మహారాష్ట్రలలో ఓటర్లను కొనుగోలు చేసేందుకు, రెయిడ్స్ పేరుతో బయపెట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోందని ఆరోపించారు.

సోరెన్‌తో సమావేశం

జేఎంఎం నేత, జార్ఖాండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను కలసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయనతో సమావేశానంతరం తేజస్వి ఓ ట్వీట్‌లో తెలిపారు. ''గౌరవనీయ జార్ఖాండ్ సీఎం, నా పెద్ద సోదరుడు హేమంత్ సోరెన్‌ను కలుసుకున్నాను. రాంచీలో జరిగిన ఈ సమావేశంలో వివిధ సామాజిక, రాజకీయ, ఆర్థిక, పలు రాజ్యాంగ అంశాలపై ఉభయులూ చర్చించాం'' అని యాదవ్ ట్వీట్ చేశారు.

హేమంత్ సోరెన్ సైతం తామిరువురు కలుసుకున్న విషయాన్ని మరో ట్వీట్‌లో తెలియజేశారు. ''బీహార్ ఉపముఖ్యమంత్రిని నా నివాసంలో కలుకున్నాను. దేశం, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు మా సమావేశంలో చర్చకు వచ్చాయి'' అని ఆయన తెలిపారు.

Updated Date - 2023-02-12T19:15:43+05:30 IST