Ramcharit Manas Row: రాముడు ఊహాజనితం..చారిత్రక పురుషుడు కాదు..!
ABN , First Publish Date - 2023-03-17T19:53:46+05:30 IST
'రామచరిత మానస్'పై బీహార్ విద్యా శాఖ మంత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా ..
పాట్నా: 'రామచరిత మానస్' (Ramcharaitmanas)పై బీహార్ విద్యా శాఖ మంత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారలేదు. రాష్ట్రంలోని 'మహాఘట్ బంధన్' ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న హిందుస్తానీ అవామీ మోర్చా నేత, మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ (Jitan Ram Manjhi) శుక్రవారంనాడు చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. రాముడు ఊహాజనితమైన వ్యక్తి (Imaginaray figure) అని, చారిత్రిక పురుషుడు కాదని ఆయన వ్యాఖ్యానించారు.
''నేను ముందు నుంచే చెబుతున్నాను. రాముడు ఊహజనితమైన వ్యక్తి. చారిత్రక పురుషుడు కాదు. ఇలా చెప్పిన మొదటి వ్యక్తిని నేను కాదు. రాహుల్ సాంకృత్యాయన్, లోకమాన్య తిలక్ వంటి మేథావులు కూడా ఇదేతరహా అభిప్రాయాలను వెలిబుచ్చారు. వాళ్లు బ్రాహ్మణులు కాబట్టి, ఎవరికీ అభ్యంతరకరంగా తోచలేదు. అదే నేను చెబితే, అది జనానికి సమస్య అవుతుంది'' అని మాంఝీ అన్నారు. పురాణాల్లో చూసినా రావణుడు కర్మకాండల విషయంలో రాముడి కంటే బాగా తెలిసినవాడని అన్నారు. పురాతన రామాయణాన్ని రచించినట్టు చెబుతున్న వాల్మీకిని ఎప్పుడూ తులసీదాసును ఆరాధించినంతగా జనం ఆరాధించకపోవడానికి కారణమేమిటో ఆలోచించాలని ఆయన వ్యాఖ్యానించారు. రాముడు శబరి (గిరిజన భక్తురాలు) ఇచ్చిన పండ్లు తీసుకున్నట్టు చెబుతారని, అయితే ఆయన (రాముడు) భక్తులమని చెప్పుకునే వారు మాత్రం దళిత, గిరిజనుల పట్ల వివక్ష చూపుతూనే ఉన్నారని ఆక్షేపించారు.
రామచరితమానస్ లోని కొన్ని పేరాలు తొలగించాలంటూ బీహార్ ఆర్జేడీ మంత్రి చంద్రశేఖర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సహజంగానే విపక్షంలో ఉన్న బీజేపీ విమర్శలు గుప్పించింది. 2025లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, దీనికి ముందు 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉండటంతోనే ఇటీవల కాలంలో పెరుగుతున్న హిందుత్వ వాదనకు అడ్డుకట్టు వేసేందుకు మంత్రి కులం కార్డును పైకి తీసినట్టు విశ్లేషకుల అంచనాగా ఉంది.