Mahua Moitra: మహాభారత యుద్ధాన్ని చూస్తారు: మొయిత్రా
ABN , First Publish Date - 2023-12-08T15:19:21+05:30 IST
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలంటూ పార్లమెంటు ఎథిక్స్ కమిటీ సిఫారసు చేయడం, నివేదికను లోక్‌సభలో శుక్రవారంనాడు ప్రవేశపెట్టడంపై ఆమె ఘాటుగా స్పందించారు. ''ఇక మహాభారత యుద్ధాన్ని చూస్తారు'' అంటూ వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మెయిత్రా (Mahua Moitra)ను లోక్‌సభ నుంచి బహిష్కరించాలంటూ పార్లమెంటు ఎథిక్స్ కమిటీ సిఫారసు చేయడం, నివేదికను లోక్‌సభలో శుక్రవారంనాడు ప్రవేశపెట్టడంపై ఆమె ఘాటుగా స్పందించారు. ''ఇక మహాభారత యుద్ధాన్ని చూస్తారు'' అంటూ వ్యాఖ్యానించారు.
నివేదికపై మహువా మెయిత్రా పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడుతూ..''దుర్గా మాత వచ్చింది. ఇక చూసుకుందాం. వినాశనం సంభవించినప్పుడు మొదట కనుమరుగయ్యేది వివేకమే, వస్త్రాపహరణను వాళ్లు మొదలుపెట్టారు. ఇక మహాభారత యుద్ధాన్ని చూస్తారు'' అంటూ బీజేపీ సర్కార్‌పై ఘాటు విమర్శలు చేశారు.
లోకసభలో 500 పేజీలతో కూడిన నివేదికను బీజేపీ ఎంపీ, ఎథిక్స్ కమిటీ చైర్మన్ విజయ్ సోన్కర్ టీఎంసీ ఎంపీల ఆందోళనల మధ్య శుక్రవారం ఉదయం ప్రవేశపెట్టారు. ఎథిక్స్ కమిటీ నివేదక కాపీ తమకు ఇవ్వాలని, ఓటింగ్‌కు ముందు చర్చ జరిపాలని, టీఎంసీ మొయిత్రీ తన వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను టీఎంసీ ఎంపీలు కోరారు.
మెయిత్రా మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి నిరాకరణ
కాగా, సభలో మహువా మొయిత్రా మాట్లాడేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి నిరాకరించారు. 2005లో స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారనే ఆరోపణలను ఎదుర్కొన్న 10 మంది ఎంపీలను సభలో మాట్లాడేందుకు అప్పటి స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ అనుమతి నిరాకరించారని అన్నారు. నాటి స్పీకర్లు పాటించిన సంప్రదాయాన్నే తాను అనుసరిస్తున్నట్టు ఓం బిర్లా చెప్పారు.