Madhya Pradesh: ఇసుక మాఫియా ఘాతుకం.. రెవెన్యూ అధికారిని ట్రక్కుతో తొక్కించి చంపేసిన వైనం
ABN , First Publish Date - 2023-11-26T16:38:24+05:30 IST
మధ్యప్రదేశ్‌లోని ఇసుక మాఫియా మరోసారి రెచ్చిపోయింది. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న ఒక పట్వారిని ట్రక్కుతో తొక్కించి ప్రాణాలు తీసింది. షహడోల్ జిల్లా సన్ రీవర్ వద్ద శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
షహడోల్: మధ్యప్రదేశ్‌లోని ఇసుక మాఫియా మరోసారి రెచ్చిపోయింది. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న ఒక పట్వారి (Revenue official)ని ట్రక్కుతో తొక్కించి ప్రాణాలు తీసింది. షహడోల్ జిల్లా సన్ రీవర్ వద్ద శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
అక్రమ ఇసుక రవాణా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు పట్వారి ప్రసన్న సింగ్‌తో కూడిన గస్తీ బృందం గోపాల్‌పుర ప్రాంతంలో సన్ రీవర్ వద్దకు చేరుకుంది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రక్-ట్రాలీని అడ్డుకునేందుకు పట్వారి సింగ్ ప్రయత్నించగా ట్రక్కు డ్రైవర్ ఆయన మీదుగా వాహనం నడిపించాడు. దీంతో పట్వారి సింగ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటన అనంతరం డ్రైవర్ పారిపోగా, అతనిని 25 ఏళ్ల శుభం విశ్వకర్మగా గుర్తించి ఆదివారం ఉదయం అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఐపీసీ 302 (హత్య) కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి, ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు.