Hospital Deaths: సీఎం సొంత జిల్లా ఆసుపత్రిలో విషాదం.. 48 మంది గంటల్లో 20 మంది మృతి
ABN , First Publish Date - 2023-08-13T18:37:16+05:30 IST
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సొంత జిల్లా థానే లోని ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆసుపత్రిలో గత 48 గంటల్లో 20 మందికి పైగా పేషెంట్లు మరణించడం సంచలనమైంది. పేషెంట్ల రద్దీ ఎక్కువగా ఉండటం, తగినంతమంది డాక్టర్లు లేకపోవడం ఈ మరణాలకు కారణంగా చెబుతున్నారు.
థానే: మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) సొంత జిల్లా థానే (Thane)లోని ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆసుపత్రిలో గత 48 గంటల్లో 20 మందికి పైగా పేషెంట్లు మరణించడం సంచలనమైంది. పేషెంట్ల రద్దీ ఎక్కువగా ఉండటం, తగినంతమంది డాక్టర్లు లేకపోవడం ఈ మరణాలకు కారణంగా చెబుతున్నారు. ఆసుపత్రిలో చేరిన పేషెంట్ల గరిష్ట స్థాయిలో చికిత్స అందిందా లేదా అనే దానిపై దర్యాప్తునకు ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు ఆదివారంనాడు తెలిపారు.
నిష్పాక్షిక దర్యాప్తు..
గంటల వ్యవధిలోనే పలువురు పేషెంట్లు మరణించడంపై థానే మున్సిపల్ కమిషనర్ అభిజిత్ బంగర్ మాట్లాడుతూ, గత 48 గంటల్లో 18 మరణాలు సంభవించినట్టు తమకు సమాచారం అందిందని చెప్పారు. చనిపోయిన కొందరు పేషెంట్లు ఇప్పటికే కిడ్నీ సమస్యలు, నుమోనియా, కిరోసిన్ పాయిజనింగ్, రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాలపై చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రికి క్లుప్తంగా ఈ విషయం తెలియజేశానని అన్నారు. పేషెంట్లకు అవసరమైన చికిత్స ఇవ్వడం జరిగిందా అనే విషయంపై నిష్పాక్షిక విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
మంత్రి సంతాపం, నష్టపరిహారం..
కాగా, దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర మంత్రి దీపక్ కేసర్కర్ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, ఆసుపత్రిలో తగినంత మంది డాక్టర్లు లేకపోవడం వల్లే ఇన్ని మరణాలు సంభవించాయని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మరణాల సంఘటనను ఆసుపత్రి వర్గాలు సైతం ధ్రువీకరించాయి. పరిస్థితి తీవ్రంగా ఉన్న కొందరు పేషెంట్లను ప్రైవేటు ఆసుపత్రికి పంపామని, మరికొందరు 80 ఏళ్లకు పైబడివారు కూడా ఉన్నారని ఆ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఆసుపత్రి మూసేయడంతో పేషెంట్లందరూ పేషెంట్లను ఇక్కడకు తీసుకు వచ్చారని, వైద్యులు, వైద్య సదుపాయల కొరత ఉందని ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ బరోట్ తెలిపారు.
షిండే సొంత జిల్లా
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే జిల్లా సొంత జిల్లా ధానే కావడం విశేషం. ఇటీవలే షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కలిసి థానేలో సూపర్ స్పెషాలిటీ కేనర్స్ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. జిల్లా పాత ప్రభుత్వాసుపత్రిని కూల్చివేసి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కూడా జరుగుతోంది.