MLA Slapping engineer: ఇంజనీర్ చెంప చెళ్లుమనిపించిన మహిళా ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2023-06-21T16:30:13+05:30 IST

ప్రజాసమస్యలు పరిష్కరించే సమయంలో సంయమనంగా వ్యవహరించాల్సిన ఓ మహిళా ఎమ్మెల్యే అందరూ చూస్తుండగా విధి నిర్వహణలో ఉన్న ఇంజనీర్ చెంప చెళ్లుమనిపించారు. దీనిపై షల్ మీడియోలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్రలోని థానే జిల్లా మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మంగళవారంనాడు ఈ ఘటన చోటుచేసుకుంది.

MLA Slapping engineer: ఇంజనీర్ చెంప చెళ్లుమనిపించిన మహిళా ఎమ్మెల్యే

థానే: ప్రజాసమస్యలు పరిష్కరించే సమయంలో సంయమనంగా వ్యవహరించాల్సిన ఓ మహిళా ఎమ్మెల్యే (Woman legislator) అందరూ చూస్తుండగా విధి నిర్వహణలో ఉన్న ఇంజనీర్ (Engineer) చెంప చెళ్లుమనిపించారు. ఇందుకు ఆ ఎమ్మెల్యే విచారం కూడా వ్యక్తం చేయకపోవడం చూసి సోషల్ మీడియోలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్రలోని థానే (Thane) జిల్లా మీరా భయందర్ (Mira Bhayandar) మున్సిపల్ కార్పొరేషన్‌లో మంగళవారంనాడు ఈ ఘటన చోటుచేసుకుంది.

అక్రమ నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిని మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంబీఎంసీ) కూల్చివేసింది. దీంతో ఈ ఇంట్లో నివాసం ఉంటున్న పిల్లలు, వృద్ధులు వర్షంలో గడపాల్సి వచ్చింది. విషయం తెలిసిన మీరా-భయందర్ ఎమ్మెల్యే గీతా జైన్ అక్కడకు చేరుకున్నారు. కూల్చివేతలను పర్యవేక్షించిన ఇంజనీర్లపై మండిపడ్డారు. ఒక్కసారిగా ఆవేశానికి లోనైన గీతా జైన్ అందరిముందు ఒక ఇంజనీర్ చొక్కాపట్టుకుని ఊహించని విధంగా చెంప చెళ్లుమనిపించారు. తన చర్య చట్టవిరుద్ధమని జైన్ గ్రహించనప్పటికీ ఆమె ఎలాంటి విచారం వ్యక్తం చేయలేదు. ఇందువల్ల ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కునేందుకు సిద్ధమన్నారు. సొంత గూడు కోల్పోయి ఒక మహిళ కంటతడి పెడుతుంటే అధికారులు నవ్వుకోవడం తనను ఆగ్రహానికి గురిచేసిందని అన్నారు. అప్రయత్నంగానే తాను స్పందించానని చెప్పారు. ఇంటిలోని కొంత భాగం మాత్రమే ఆక్రమణలో ఉందని, దానిని తొలగించేందుకు ఓనర్లు కూడా అంగీకరించారని ఆమె తెలిపారు. అయితే మున్సిపల్ అధికారులు మొత్తం ఇంటిని కూల్చేశారని చెప్పారు. వర్షాకాలం సీజన్‌లో ఆక్రమణల కూల్చేవేతను నిషేధిస్తూ గవర్నమెంట్ రిజల్యూషన్ ఉందని, ఆ విషయాన్ని తాను 15 రోజులకు ముందే తెలియజేశానని అన్నారు. ఏటా జూన్ 1 నుంచి ఇది ఆదేశాలు అమల్లో ఉంటాయన్నారు. తాను ముందుగానే సమచారం ఇచ్చినప్పటికీ ఇంటికూల్చివేత చర్యలు చేపట్టారని చెప్పారు. మున్సిపల్ అధికారులను జీఆర్‌ను వ్యతిరేకించడమే కాకుండా, కూల్చివేతను అడ్డుకున్న మహిళలపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.

అసెంబ్లీలో ప్రస్తావిస్తా...

ఈ అంశాన్ని అసెంబ్లీలో తాను ప్రస్తావిస్తానిని గీతా జైన్ చెప్పారు. ఆయన (ఇంజనీర్) కేసు పెట్టాలనుకుంటే ఆ పని చేయవచ్చని, దానిని తాను ఎదుర్కొంటానని చెప్పారు. ప్రైవేటు ల్యాండ్‌లోని నిర్మాణాలను మున్సిపల్ అధికారులు ఎలా కూల్చివేస్తారని జైన్ ప్రశ్నించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గీతా జైన్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు మద్దతు ప్రకటించారు. ఏక్‌నాథ్ షిండే 2022లో శివసేన సర్కార్‌పై తిరుగుబాటు చేయడంతో ప్రస్తుతం ఆమె బీజేపీ క్యాంపులో చేరారు.

Updated Date - 2023-06-21T17:13:06+05:30 IST