Mallikarjun Kharge: వారివి మాటలు తప్ప చుక్క రక్తమైనా చిందించారా.. బీజేపీపై మల్లికార్జున ఖర్గే విమర్శలు
ABN , First Publish Date - 2023-11-20T17:41:03+05:30 IST
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం తప్పితే.. వాళ్లు దేశానికి చేసిందేమి లేదని మండిపడ్డారు. తమ కాంగ్రెస్ పార్టీ...
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం తప్పితే.. వాళ్లు దేశానికి చేసిందేమి లేదని మండిపడ్డారు. తమ కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిందని.. కానీ వాళ్లు పోరాడిందేమీ లేదని, ఒక్కరు కూడా జైలుకి వెళ్లిన దాఖలాలు లేవంటూ ఫైరయ్యారు. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన ఈ మేరకు ధ్వజమెత్తారు.
‘‘ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కి చెందిన వాళ్లు చుక్క రక్తం కూడా చిందించలేదు. ఎంతమంది బీజేపీ వాళ్లు జైలుకు వెళ్లారు? దేశం కోసం ఎంతమంది బీజేపీ వాళ్లు పోరాడారు? పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌తో పాటు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పోరాడింది. కానీ.. వాళ్లు పోరాడిందేమీ లేదు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, బాబాసాహెబ్ అంబేద్కర్ కలిసి దేశ రాజ్యాంగాన్ని రూపొందించారు’’ అని మల్లికార్జున ఖర్గే తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. తమ కాంగ్రెస్ రాజస్థాన్‌లో ఏడు హామీల్ని ప్రకటించిందని, తాము తిరిగి అధికారంలోకి వస్తే తప్పకుండా ఆ హామీలను నెరవేరుస్తామని ఖర్గే ప్రకటించారు.
రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో.. 1. కుటుంబ పెద్దలకు వార్షికంగా రూ.10,000 గౌరవ వేతనం ఇవ్వడం, 2. 1.05 కోట్ల కుటుంబాలకు రూ.500 లకే ఎల్‌పీజీ సిలిండర్, 3. పశువుల కాపరుల నుంచి కిలోకు రూ.2 చొప్పున ఆవు పేడ కొనుగోలు చేయడం, 4. ప్రభుత్వ ఉద్యోగుల కోసం పాత పింఛను పునరుద్ధరణ, 5. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశం పొందే విద్యార్థులకు ట్యాబ్లెట్లు లేదా ల్యాప్‌టాప్‌లు అందించడం, 6. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేసేందుకు ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించడం వంటివి ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బీజేపీ దాదాపు ఇవే హామీల్ని కాపీ కొట్టింది.
కాగా.. నవంబర్ 25న రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇటు కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలని, అటు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం పొందాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. సర్వేలు సైతం ఈ రెండింటి మధ్య ఆ రాష్ట్రంలో హోరాహోరీ పోరు కొనసాగుతుందని చెప్తున్నాయి. దీంతో.. రాజస్థాన్‌లో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.