Mallikarjun Kharge: ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు.. తేల్చి చెప్పేసిన మల్లికార్జున ఖర్గే
ABN , First Publish Date - 2023-11-01T21:43:00+05:30 IST
2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో కొన్ని విపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కూటమి మూడుసార్లు సమావేశం నిర్వహించింది. మధ్యలో అంతర్గత విభేదాలు తలెత్తినా..
2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో కొన్ని విపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కూటమి మూడుసార్లు సమావేశం నిర్వహించింది. మధ్యలో అంతర్గత విభేదాలు తలెత్తినా.. తామంతా ఒక్కటేనంటూ అప్పటికప్పుడే ఆ వార్తలపై క్లారిటీలు ఇచ్చేస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఈ కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు? అనేదే మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. పైపెచ్చు బిహార్ సీఎం నితీశ్ కుమార్ పేరు చక్కర్లు కొడుతున్నా.. కూటమి నుంచి మాత్రం ఈ అంశంపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అందుకే.. కూటమిలోని ప్రధాన నేతలు కనిపించినప్పుడల్లా ‘ప్రధాని అభ్యర్థి ఎవరు’ అనే ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది.
ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. ఇందుకు ఆయన బదులిస్తూ.. ‘‘ఎన్నికల్లో తమ కూటమి గెలుపొందిన తర్వాత అందరూ కూర్చొని ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనేది నిర్ణయం తీసుకుంటాం’’ అని తన కాంగ్రెస్ పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. అంటే.. ఇంకా ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయించలేదని, ఎన్నికలయ్యేదాకా ఆ ఎంపిక ఉండదని ఖర్గే తేల్చి చెప్పేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఏం మాట్లాడినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, తాము ఛత్తీస్‌గఢ్‌లో 75 సీట్లకు పైగా గెలుస్తామని.. అక్కడ తిరిగి తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ పాలన పట్ల ఛత్తీస్‌గఢ్ ప్రజలు సంతోషంగా ఉన్నారని, మళ్లీ తమ పార్టీనే వాళ్లు గెలిపిస్తారని పేర్కొన్నారు.
మళ్లీ తాము అధికారంలోకి వస్తే.. ఛత్తీస్‌గఢ్‌లో రైతుల సమస్యలను పరిష్కరిస్తామని, ప్రాథమిక నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తామని, మహిళలకు సిలిండర్లు ఇస్తామని ఖర్గే హామీ ఇచ్చారు. అయితే.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న ప్రశ్నపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఆ సమయంలో ఎన్నికయ్యే ఎమ్మెల్యేలు సీఎంని నిర్ణయిస్తారని తెలిపారు. అనంతరం మోదీ ప్రభుత్వాన్ని పరోక్షంగా టార్గెట్ చేస్తూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. కాంగ్రెస్ ఎయిర్‌పోర్టులు, ఫ్యాక్టరీలు కట్టిందని.. కానీ బీజేపీ వాటిని ధనికులకు అమ్మేసిందని ఆరోపించారు. అందరం కలిసి ఎంతో కష్టపడి ఈ దేశాన్ని నిర్మించుకున్నామని, దేశం ఆస్తిని అమ్మేవాడు దేశ క్షేమం గురించి ఆలోచించడని మోదీకి చురకలంటించారు.