India-Bharat Row: అకస్మాత్తుగా పేరు మార్పెందుకు?..నిలదీసిన మమత
ABN , First Publish Date - 2023-09-05T17:50:03+05:30 IST
'ఇండియా' పేరుకు బదులుగా ప్రాచీన కాలం నాటి "భారత్'' ను తిరిగి తీసుకువచ్చేందుకు కేంద్రం వేగంగా పావులు కదుపుతుండటంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఇంత అకస్మాత్తుగా పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: 'ఇండియా' (India) పేరుకు బదులుగా ప్రాచీన కాలం నాటి "భారత్'' (Bharat)ను తిరిగి తీసుకువచ్చేందుకు కేంద్రం వేగంగా పావులు కదుపుతుండటంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Benarjee) స్పందించారు. ఇంత అకస్మాత్తుగా పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సెప్టెంబరు 9న జరిగే జీ20 విందు కోసం రాష్ట్రపతి భవన్ పంపించిన ఆహ్వాన పత్రాలలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అనడానికి బదులుగా, ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాసి ఉండటంతో..పేరుమార్పు వ్యవహారంపై ఒక్కసారిగా రాజకీయంగా చర్చ మొదలైంది.
దీనిపై మమతా బెనర్జీ కోల్‌కతాలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో స్పందించారు.''ఇండియా పేరును మారుస్తున్నట్టు విన్నాను. రాష్ట్రపతి భవన్ పంపిన జి-20 ఆహ్వానపత్రంలో ఈ పేరు మార్పు చోటుచేసుకుంది. మనం ఈ దేశాన్ని భారత్ అని పిలుస్తాం. అందులో కొత్త ఏముంది? ఇంగ్లీషులో ఇండియా అంటాం. ఇందులో పేరు మార్పుకోసం చేయాల్సిందేముంది? ఇండియా పేరు అందరికీ తెలిసిందే. అకస్మాత్తుగా దేశం పేరు మార్చాల్సిన అవసరం ఏముంది?'' అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఈ దేశ చరిత్రను తిరగరాస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
గవర్నర్‌పై మండిపాటు..
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా తన వద్దే ఉంచుకుంటున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. గవర్నర్ చర్యలు రాష్ట్ర యంత్రాగాన్ని స్తంభింపజేసేలా ఉన్నాయని అన్నారు. ఆర్థిక బిల్లులను తనవద్దే ఆయన ఉంచుకోవడం సాధ్యం కాదని, దీనిపై అవసరమైతే రాజ్‌భవన్ బయట ధర్నాకు దిగుతామని తెలిపారు. రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీల విషయంలోనూ గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని తప్పుపట్టారు. ఇదేతరహా ఆయన జోక్యం చేసుకుంటూ పోతే తాను నిధులను నిలిపివేస్తామన్నారు. గవర్నర్ బోస్ గత ఆదివారంనాడు రాష్ట్ర ప్రభుత్వ యూనివర్శిటీల ఛాన్స్‌లర్‌గా తనకున్న హోదాను ఉపయోగించుకుని ఏడు యూనివర్శిటీలకు తాత్కాలిక వైస్-ఛాన్సలర్లను నియమించారు.