Terrorists In Mumbai: ముంబయిలోకి ఉగ్రవాదులు చొరబడ్డారంటూ ఫోన్ కాల్.. తీరా చూస్తే ఊహించని ట్విస్ట్
ABN , First Publish Date - 2023-11-27T18:08:32+05:30 IST
ఈమధ్య కాలంలో బూటకపు ఫోన్ కాల్స్ బెడద ఎక్కువైపోయింది. ఆ వ్యక్తులను ఇతరులెవరైనా ఉసిగొల్పుతున్నారో లేక ఇతర కారణాలు ఉన్నాయో తెలీదు కానీ.. కొందరు ఉద్దేశపూర్వకంగా ఫేక్ కాల్స్ చేస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారు.
Mumbai Hoax Call: ఈమధ్య కాలంలో బూటకపు ఫోన్ కాల్స్ బెడద ఎక్కువైపోయింది. ఆ వ్యక్తులను ఇతరులెవరైనా ఉసిగొల్పుతున్నారో లేక ఇతర కారణాలు ఉన్నాయో తెలీదు కానీ.. కొందరు ఉద్దేశపూర్వకంగా ఫేక్ కాల్స్ చేస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఫలానా వ్యక్తుల్ని చంపుతామనో లేక బాంబులు పెట్టారనో తప్పుడు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. తాజాగా ముంబయి నగరంలోనూ ఇలాంటి పరిణామమే వెలుగుచూసింది. ముంబయిలోకి కొందరు ఉగ్రవాదులు చొరబడ్డారంటూ ఓ వ్యక్తి పోలీసులకు బూటకపు ఫోన్ కాల్ చేశాడు. దీంతో.. కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
26/11 ఉగ్రదాడుల వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఉదయం 10 గంటల సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ముంబయి నగరంలోకి ముగ్గురు ఉగ్రవాదులు చొరబడ్డారని చెప్పి, అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. వెంటనే విచారణ మొదలుపెట్టారు. అసలు ఈ ఫోన్ ఎవరి వద్ద నుంచి వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే లక్ష్మణ్ నానావరే అనే 31 ఏళ్ల వ్యక్తి నుంచి ఈ ఫోన్ వచ్చిందని పోలీసులు పసిగట్టారు. దీంతో.. వెంటనే అతడి ఆచూకీ కనుగొని, అక్కడికి వెళ్లి అతడ్ని అరెస్ట్ చేశారు. అలాగే.. అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 505 (1) (బి) కింద కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారంపై ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ముంబయి నగరంలోకి ముగ్గురు ఉగ్రవాదులు చొరబడ్డారని కాలర్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాడు. ఆ తర్వాత మేము వెంటనే దర్యాప్తు ప్రారంభించాం. దర్యాప్తులో భాగంగా ఇదొక బూటకపు ఫోన్ కాల్ అని గుర్తించాం. నిందితుడు లక్ష్మణ్‌ని అదుపులోకి తీసుకున్నాం’’ అని వివరించారు. నిందితుడు మత్తులో పోలీసులకు ఈ బూటకపు ఫోన్ కాల్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మరోసారి ఇలాంటి పనులకు పాల్పడకుండా ఉండేలా అతనికి తగిన బుద్ధి చెప్పినట్టు తెలిసింది.