Manipur Governor Anusuiya Uikey: మైతేయీ, కుకీల మధ్య ద్వేషాన్ని అంతం చేసేందుకు కృషి చేస్తున్నా: మణిపూర్ గవర్నర్
ABN , First Publish Date - 2023-07-29T19:38:26+05:30 IST
మణిపూర్: మైతేయీ, కుకీ వర్గాల మధ్య నెలకొన్న ద్వేషం, అపనమ్మకాల్ని అంతం చేయడానికి తాను కృషి చేస్తున్నానని మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికే పేర్కొన్నారు. శనివారం చురచంద్‌పూర్ జిల్లాలోని ఒక సహాయ శిబిరాన్ని..
మణిపూర్: మైతేయీ, కుకీ వర్గాల మధ్య నెలకొన్న ద్వేషం, అపనమ్మకాల్ని అంతం చేయడానికి తాను కృషి చేస్తున్నానని మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికే పేర్కొన్నారు. శనివారం చురచంద్‌పూర్ జిల్లాలోని ఒక సహాయ శిబిరాన్ని సందర్శించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. మైతేయీ, కుకీ వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థల్ని కలుస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో శాంతి, పరిస్థితుల్ని సాధారణ స్థితిని తీసుకొచ్చేందుకు వారి సహకారం కోరుతున్నానని తెలిపారు. తాను రెండోసారి సహాయ శిబిరానికి వచ్చానని.. దాదాపు మూడు నెలలు ఈ ప్రజలు తమ ఇళ్లకు దూరంగా ఉన్నారన్నారు. చాలామంది ప్రజలు తమ ఇళ్లతో పాటు అన్ని కోల్పోయారని, వారికి ఏమీ మిగల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సహాయ శిబిరాల్లోనైనా వీరికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా తాను ఇక్కడికి వచ్చినట్టు ఆమె స్పష్టం చేశారు.
బట్టల దగ్గర నుంచి దోమల నివారణ మందుల వరకు.. కనీస సౌకర్యాలను సహాయ శిబిరాల్లో ఉన్న ప్రజలకు అందించాలని తాను ప్రభుత్వాన్ని ఆదేశించానని గవర్నర్ అనసూయ చెప్పారు. ఇక్కడ మందుల సమస్య ఉందని కూడా తెలుసుకున్నానని, ట్రక్కులు ఇక్కడికి రాకపోవడంతో వారికి చాలా వస్తువులు అందడం లేదని అన్నారు. అయినప్పటికీ.. అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయయని, మిజోరాం కూడా తనవంతు సహాయం అందిస్తోందని చెప్పారు. జాతి కలహాలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రజలు, ముఖ్యంగా నాయకులు రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాగా.. తమకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ మైతేయీ వర్గం వారు ‘ఆదివాసి సంఘీభావ యాత్ర’ చేపట్టిన తర్వాత.. మే 3న మణిపూర్‌లో జాతి ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల కారణంగా ఇప్పటిదాకా 160 మంది చనిపోగా.. చాలామంది గాయాలపాలయ్యారు.