Manipur Violence: మణిపూర్ మంటలపై స్థాయీ నివేదికకు ఆదేశించిన సుప్రీంకోర్టు
ABN , First Publish Date - 2023-07-03T15:51:21+05:30 IST
హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో తాజా పరిస్థితిపై స్థాయీ నివేదకను ఇవ్వాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. పునరావాస శిబిరాలు, స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, శాంతి భద్రతల పరిస్థితికి సంబంధించి అప్డేడెట్ సమాచారాన్ని తమకు అందజేయాలని సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
న్యూఢిల్లీ: హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో (Manipur Violence) తాజా పరిస్థితిపై స్థాయీ నివేదకను (Status Repport) ఇవ్వాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం ఆదేశించింది. పునరావాస శిబిరాలు, స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, శాంతి భద్రతల పరిస్థితికి సంబంధించి అప్డేడెట్ సమాచారాన్ని తమకు అందజేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ (DY Chandrachud), న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 10వ తేదీకి వాయిదా వేసింది. భారత సైన్యం నుంచి కుకీ తెగలకు రక్షణ కల్పించాలని ఢిల్లీలోకి చెందిన మణిపూర్ ట్రైబల్ ఫోరం వేసిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణ జరింది.
మణిపూర్ ట్రైబల్ ఫోరం తరఫున సీనియర్ న్యాయవాది కాలిన్ గోంసాల్వేస్ కోర్టు ముందు తన వాదన వినిపిస్తూ, మణిపూర్‌లో పరిస్థితి విషమించిందని చెప్పారు. దీనికి మణిపూర్ తరఫున భారత సొలిసిటర్ జనరల్ సమాధానమిస్తూ, పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతోందని చెప్పారు. రోజులో 5 గంటల పాటు కర్ఫ్యూ సడలిస్తున్నారని, పరిస్థితి కుదుటపడుతోందనడానికి ఇది నిదర్శనమని వివరించారు. రాష్ట్ర పోలీసులు, మణిపూర్ కమెండోలో, భారత రిజర్వ్ బెటాలియన్లు, 114 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు మణిపూర్‌లో మోహరించాయని తెలిపారు. మైటీస్ ఆర్గనైజేషన్ తరఫున న్యాయవాది తన వాదన వినిపిస్తూ, హింస వెనుక ఆయుధాలు, మిలిటెంట్ గ్రూపులు ఉన్నాయా అనే దానిపై విచారణ జరపాలన్నారు. షెల్టర్ల నుంచి మిలిటెంట్లు బయటకు వచ్చి పోరాడుతున్నాయనే అనుమానం కలుగుతోందని, లేదంటే మారణాయుధాలు, మిలిటెంట్ల లెక్కలు ఎలా చెప్పగలుగుతారని ప్రశ్నించారు. భారత ప్రభుత్వం ఈ కోణం నుంచి ఆలోచించాలన్నారు.
మణిపూర్‌లో హింసాకాండపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు బూటకపు హామీలిచ్చాయని, అయితే ఏమాత్రం వారికి చిత్తశుద్ధి లేదని మణిపూర్ ట్రైబల్ ఫోరం తమ పిటిషన్‌లో ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీసులను గిరిజనులు విశ్వసించడం లేదని, ఇండియన్ ఆర్మీతో వారిని రక్షణ కల్పించాలని కోరింది. చురాచాంద్‌పూర్, ఛండేల్, కాంగ్పోక్పి, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్ జిల్లాల్లో శాంతిభద్రతల పరిస్థితిన ఇండియన్ ఆర్మీ పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోవాలని కోరింది. గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూ ర్తి అజయ్ లాంబా నేతృత్వంలో కేంద్రం ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిషన్‌పై తమకు నమ్మకం లేదని తెలిపింది. ఆ ఆదేశాలను రద్దు చేసి ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, లా కమిషన్ చైర్‌పర్సన్ ఏపీ షాతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని కోర్టును కోరింది. అసోం మాజీ పోలీస్ చీఫ్ హరికృష్ణ డెకా నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయాలని, హింసాకాండలో మరణించిన ప్రతి కుటుంబానికి రూ.రెండు కోట్ల చొప్పున మూడు నెలల్లో ఎక్స్‌గ్రేషియా అందించాలని కోరింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేసింది.
కేసులో వాదనలు విన్న ధర్మాసనం మెయిటీ, కుకీ తెగల మధ్య హింసాకాండలో బాధితుల పునరావాసానికి చేపట్టిన చర్యలు వివరిస్తూ తాజా స్థాయీ నివేదికను అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. గత మే 3న ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ మణిపూర్ నిర్వహించిన ర్యాలీ అనంతరం హిందూ మెయిటీలు, క్రిష్టియన్ గిరిజన కుకీల మధ్య అల్లర్లు చెలరేగి, అది హింసాకాండగా మారింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు హింసాకాండ విస్తరించడంతో మణిపూర్ భగ్గుమంటోంది.