Delhi Excise Policy Case : ఆర్థిక లావాదేవీలు పట్టుబడలేదు : మనీశ్ సిసోడియా
ABN , First Publish Date - 2023-04-20T16:44:29+05:30 IST
ఢిల్లీ మద్యం విధానం కేసులో తనను జైలులో మగ్గిపోయేలా చేయడం కోసం సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ-CBI) ప్రయత్నిస్తోందని
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం విధానం కేసులో తనను జైలులో మగ్గిపోయేలా చేయడం కోసం సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ-CBI) ప్రయత్నిస్తోందని ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) ఆరోపించారు. ఈ కేసులో తన ప్రమేయంపై ఎటువంటి సాక్ష్యాలు లేవని, అందువల్ల తనకు బెయిలు మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)ను గురువారం కోరారు.
సిసోడియా తరపున సీనియర్ అడ్వకేట్ దయన్ కృష్ణన్ వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో సీబీఐ పేర్కొన్న నిందితుల్లో సిసోడియాకు తప్ప మిగిలినవారందరికీ బెయిలు మంజూరైనట్లు తెలిపారు. సిసోడియా సాక్ష్యాధారాలను తారుమారు చేసినట్లు రుజువు చేసే సాక్ష్యాలేవీ సీబీఐ వద్ద లేవన్నారు.
సిసోడియా దాఖలు చేసిన బెయిలు దరఖాస్తులో, ‘‘నేను సహకరించడం లేదని వారు (సీబీఐ) చెప్తున్నారు. నాకు బెయిలు తిరస్కరించడానికి ఇది కారణం కాకూడదు. నేను సహకరించవలసిన, నేరాన్ని అంగీకరించవలసిన, లేదా వారి ప్రశ్నలకు వారు కోరుకున్న విధంగా సమాధానాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు. నేను నాకు కావలసినట్లుగానే సమాధానాలు చెప్పాలి. అది రాజ్యాంం ఇచ్చిన హామీ’’ అని తెలిపారు.
సిసోడియా తరపున మరో న్యాయవాది మోహిత్ మాథుర్ వాదనలు వినిపిస్తూ, సీబీఐ చెప్తున్న లెక్కలు కేవలం కాగితాలపైనే ఉన్నాయన్నారు. ఆర్థిక లావాదేవీలేవీ జరగలేదని చెప్పారు. ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి సిసోడియా అని, విజయ్ నాయర్ ద్వారా ఈ కుట్రను రూపొందించారని సీబీఐ ఆరోపిస్తోందన్నారు. నాయర్‌ను 2022 సెప్టెంబరులో అరెస్టు చేశారని, చార్జిషీట్ దాఖలు చేయకుండానే, నవంబరులో విడుదల చేశారని చెప్పారు. సిసోడియాను 2023 ఫిబ్రవరిలో రెండోసారి ప్రశ్నించేందుకు పిలిచారన్నారు. సాక్షులను సిసోడియా ప్రభావితం చేస్తారని ఆరోపించడం పూర్తిగా తప్పు అని తెలిపారు.
ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ బుధవారం జరుగుతుందని కోర్టు తెలిపింది. ఆ రోజున సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వాదనలు వినిపిస్తారు. ఎక్సయిజ్ పాలసీ ఏ విధంగా అమలైందో తెలియజేయాలని కోర్టు రాజును కోరింది. దీని గురించి వివరించేందుకు సీబీఐ దర్యాప్తు అధికారిని పిలవవచ్చునని తెలిపింది.
ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.2,600 కోట్ల మేరకు నష్టం జరిగినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో సుమారు 11 మంది అరెస్టయ్యారు. తెలంగాణ ఎమ్మెల్సీ కవితను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. సిసోడియాను సీబీఐ ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. ఆ తర్వాత ఈడీ ఆయనను మార్చి 9న అరెస్ట్ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సిసోడియా తదితరులు కొందరు వ్యాపారుల నుంచి ముడుపులు స్వీకరించి, చట్టవిరుద్ధంగా లిక్కర్ లైసెన్స్‌లను ఇచ్చారని సీబీఐ ఆరోపించింది.
ఇవి కూడా చదవండి :
Jammu and Kashmir : మోదీకి బాలిక లేఖతో సత్ఫలితాలు.. పాఠశాల అభివృద్ధి ప్రారంభం..
Solar Eclipse 2023 : అరుదైన సూర్య గ్రహణాన్ని కనులారా చూసిన ఆస్ట్రేలియన్లు, ఇండోనేషియన్లు