Priyanka Fire: అమరవీరుని తనయుడిని మీర్ జాఫర్ అంటారా, అప్పుడు కేసుల్లేవే?: నిప్పులు చెరిగిన ప్రియాంక
ABN , First Publish Date - 2023-03-26T15:25:48+05:30 IST
రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు..
న్యూఢిల్లీ: రాహుల్‌గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై (Disqualification) దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆదివారం ఒకరోజు ‘సంకల్ప సత్యాగ్రహ’ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra)...మోదీ సారథ్యంలోని బీజేపీపై నిప్పులు చెరిగాయి. గాంధీ కుటుంబంపై నిరంతరం దాడులు చేస్తూ, కశ్మీర్ పండింట్ వారసత్వాన్ని అవమానిస్తూనే ఉందని మండిపడ్డారు. రాహుల్ గాంధీని ''అమరవీరుని కుమారుడు'' (Son of martyr)గా అభివర్ణిస్తూ, ఆయనను (రాహుల్) ప్రతిరోజూ అవమానిస్తూ, చివరకు నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని కూడా విడిచిపెట్టలేదని అన్నారు.
''మీరు నా సోదరుడు, అమరవీరుని కుమారుడిని ద్రోహి అంటున్నారు, మీర్ జాఫర్‌తో పోలుస్తున్నారు. మీరు ఆయన తల్లిని అవమానించారు. మీ ముఖ్యమంత్రే స్వయంగా రాహుల్‌కు అతని తల్లి ఎవరో తెలియదంటూ వ్యాఖ్యానించారు. మీరు నా కుటుంబాన్ని ప్రతిరోజూ అవమానిస్తూనే ఉన్నారు. అయినా ఎవరిపైనా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు, ఎవరినీ జైలుకు పంపలేదు, సభ్యత్వాన్ని రద్దు చేయలేదు'' అని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తన విద్యాభ్యాసం రెండు ప్రపంచ ప్రతిష్ఠాత్మక సంస్థలైన హార్వార్డ్, కేంబ్రిడ్జి యూనివర్శిటీలో పూర్తి చేశారని, అలాంటి ఆయనను వాళ్లు (బీజేపీ) పప్పూ అని పిలిచారని, ఆ తర్వాత ఆయన పప్పు కాదని, సామాన్య ప్రజానీకం సమస్యలపై అవగాహన కలిగిన నిజాయితీ పరుడనే అవగాహన తెచ్చుకున్నారని అన్నారు. తన సోదరుడు ప్రధాని వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారని, మీపై తనకు ఎలాంటి ద్వేషం లేదని చెప్పారని అన్నారు. సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు కానీ ఒకరినొకరు ద్వేషించుకునేంత విద్వేషం మనలో లేదని అన్నారని ప్రియాంక గుర్తుచేశారు. తన తండ్రిని పార్లమెంటులో అవమానించారని, సోదరుడికి మీర్ జాఫర్ అనే పేరు పెట్టారని, ఇలా.. ఎన్నో సార్లు వాళ్లు తమ కుటుంబాన్ని అవమానించినా మౌనంగానే భరిస్తూ వచ్చామని చెప్పారు.
''మీ ప్రధానే స్వయంగా నెహ్రూ పేరుపై వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ పండిట్ల కుటుంబం మొత్తాన్ని ఆయన అవమానపరిచారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన కుటుంబం పేరును కొడుకు ముందుకు తీసుకువెళే సంప్రదాయం ఈ దేశంలో ఉంది'' అని ఆమె అన్నారు.
నీరవ్ మోదీ ఓబీసీనా?: ఖర్గే
ఓబీసీలను రాహుల్ అవమానించారంటూ మాట్లడటం, రాహుల్‌పై అనర్హత వేటు వేయడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ తప్పుపట్టారు. నీరవ్ మోదీ ఓబీసీనా? మెహుల్ చోక్సీ ఓబీసీనా? లలిత్ మోదీ ఓబీసీనా? వీళ్లంతా పరారీలో ఉన్నవాళ్లు...అంటూ నిప్పులు చెరిగారు. నల్లధనంతో పరారైన వ్యక్తుల గురించి రాహుల్ ప్రస్తావించారని, వాక్ స్వేచ్ఛను పరిరక్షించేందుకు దేశవ్యాప్తంగా తాము పోరాటం జరుపుతామని అన్నారు. రాహుల్ గాంధీకి బాసటగా నిలిచిన అన్ని విపక్ష పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సంకల్ప సత్యాగ్రహ యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు పి.చిదంబంరం, జైరామ్ రమేష్, సల్మా్న్ ఖుర్షీద్, ప్రమోద్ తివారీ, అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్, అధీర్ రంజన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.