Mayawati: అతిక్ అహ్మద్ భార్యకు టిక్కెట్‌పై మాయావతి ఏమన్నారంటే..?
ABN , First Publish Date - 2023-04-10T15:55:03+05:30 IST
జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ భార్య సహిస్ట ప్రవీణ్ కు టిక్కెట్ విషయంలో వినిపిస్తున్న..
లక్నో: జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ (AtiQ Ahemd) భార్య సహిస్ట ప్రవీణ్ (Shahista Praveen)కు టిక్కెట్ విషయంలో వినిపిస్తున్న ఊహాగానాలకు బహుజన్ సమాజ్‌వాది పార్టీ (BSP) అధ్యక్షురాలు మాయావతి (Mayawati) తెరదించారు. అతిక్ భార్య సహిస్టకు కానీ, ఆయన కుటుంబ సభ్యులకు కానీ తమ పార్టీ టిక్కెట్ ఇచ్చే ప్రసక్తి లేదని తెలిపారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసు (2005)లో ప్రధాన సాక్షి అయిన ఉమేష్‌పాల్ గత ఫిబ్రవరి 27న ప్రయాగరాజ్‌లో దారుణహత్యకు గురయ్యాడు. గాయపడిన ఉమేష్‌పాల్ గన్‌మెన్ సైతం చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ కేసులో సహిష్ట ప్రవీణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఈ నేపథ్యంలో ప్రవీణ్‌కు టిక్కెట్ ఇచ్చే విషయంపై మాయావతి సోమవారంనాడు స్పష్టత ఇచ్చారు. దర్యాప్తులో అతిక్ అహ్మద్ భార్య దోషి అని తేలితే ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తామని తెలిపారు. సమాజ్‌వాది పార్టీనే అతిక్ అహ్మద్‌ను పెంచి పోషించిందని ఆమె ఆరోపించారు.
''లాయర్ ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్ కుమారుడు, భార్యపై ఎఫ్ఐఆర్ నమోదు అయినట్టు తెలుస్తోంది. దీనిని బీఎస్‌పీ సీరియస్‌గా పరిగణిస్తోంది. కేసు దర్యాప్తులో సహిష్ట ప్రవీణ్ దోషి అని తేలితే ఆమెకు మా పార్టీ నుంచి ఉద్వాసన పలుకుతాం'' అని ఓ ట్వీట్‌లో మాయావతి తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నేతగా అతిక్ అహ్మద్ అందరికీ తెలుసునని, ఆ పార్టీ నుంచే ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పారు. గతంలో సమాజ్‌వాదీ పార్టీని విమర్శించిన రాజుపాల్ భార్య కూడా ఇప్పుడు బీఎస్‌పీ నుంచి ఎస్‌పీలోకి వెళ్లారని, ఏవో సాకులు అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలనుకోవడం తగదని అన్నారు. నేరపూరిత శక్తులు ఏ కులానికి, మతానికి చెందిన వారైనప్పటికీ వారిని బీఎస్‌పీ ప్రోత్సహించే ప్రసక్తి లేదని చెప్పారు.
కాగా, రాజుపాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అతిక్ అహ్మద్ ప్రస్తుతం గుజరాత్ జైలులో ఉన్నారు. ఉమేష్ పాల్ భార్య జయపాల్ ఇచ్చిన ఫిర్యాదుతో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్, భార్య సహిష్ట ప్రవీణ్, ఇద్దరు కొడుకులు, సహాయకులు గుడ్డు ముస్లిం, గులామ్, మరో తొమ్మిది మందిపై ధూమన్‌గంజ్ పోలీస్ స్టేషన్ (ప్రయాగరాజ్) కేసు నమోదైంది. ఐపీసీలోని 147, 148 149, 302, 307, 506, 120 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాజుపాల్ హత్య కేసులో తన భర్త ప్రధాన సాక్షి అని, 2006లో తన భర్తను అతిక్ అహ్మద్, అతని అనుచరులు అపహరించుకుని వెళ్లారని, కోర్టులో తమకు అనుకూలంగా ప్రకటన ఇవ్వాలని ఒత్తిడి చేశారని జయపాల్ ఆరోపించారు.