Milk price: పాల ధర మళ్లీ పెరిగింది...
ABN , First Publish Date - 2023-04-06T08:12:58+05:30 IST
రాజధాని నగరం చెన్నై(Chennai)లో ప్రైవేటు పాల ధరను మళ్లీ లీటరుకు రూ.2 పెంచడంపై రాష్ట్ర పాల ఉత్పత్తిదారుల సంఘం
ప్యారీస్(చెన్నై): రాజధాని నగరం చెన్నై(Chennai)లో ప్రైవేటు పాల ధరను మళ్లీ లీటరుకు రూ.2 పెంచడంపై రాష్ట్ర పాల ఉత్పత్తిదారుల సంఘం ఖండించింది. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థ ‘ఆవిన్’, కొన్ని ప్రైవేటు సంస్థలు పాలను విక్రయిస్తున్నాయి. అయితే ఆవిన్ సంస్థ(Avin company) రైతుల నుంచి అధిక శాతం పాలు కొనుగోలు చేసి ప్రజలకు విక్రయిస్తోంది. మరోవైపు తిరుమల, జెర్సీ, శ్రీనివాస, హెరిటేజ్, దొడ్ల తదితర ప్రైవేటు కంపెనీలు ప్రస్తుతం లీటరు పాలకు రూ.2 అదనంగా పెంచాయి. గత పదిహేను నెలల్లో ఆరో సారి పాల ధర పెంచడం సరికాదని రాష్ట్ర పాల ఉత్పత్తిదారుల సంఘం ప్రైవేటు పాల విక్రయ సంస్థలను ఖండించాయి. పాల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బుధవారం నగరంలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పాల ధరలను ఇబ్బుడిముబ్బుడిగా పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని, ఇటీవల ఆవిన్ పాల సరఫరాలో జాప్యం ఏర్పడిన కారణంగా ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఆవిన్ పాల ధరలు తగ్గించి, ప్రైవేటు సంస్థలను కట్టడి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.