Milk price: నేటి నుంచి సామాన్యులపై ధరాఘాతం.. రూ. 3 పెరగనున్న పాల ధర
ABN , First Publish Date - 2023-08-01T07:34:31+05:30 IST
సామాన్యులు, మధ్యతరగతి ప్రజలపై నేటి నుంచి దరాఘాతం పడనుంది. నందిని పాల(Nandini milk) ధర లీటర్ రూ.3 పెరగనుండగా హోటళ్లలో టి
- టిఫిన్లు, భోజనాలు మరింత ప్రియం
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): సామాన్యులు, మధ్యతరగతి ప్రజలపై నేటి నుంచి దరాఘాతం పడనుంది. నందిని పాల(Nandini milk) ధర లీటర్ రూ.3 పెరగనుండగా హోటళ్లలో టిఫిన్లు, భోజనం ధరలు ఏకంగా రూ.5 నుంచి రూ.10 వరకు పెరగనున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరల పెరుగుదలతో విలవిల్లాడుతున్న ప్రజలపై ఇది మరింత భారం కానుంది. పాల ధరను లీటర్‌పై రూ.3 చొప్పున పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే పచ్చజెండా చూపింది. ఆగస్టు 1 నుంచి నూతన ధర అమల్లోకి రానుంది. పాలతో పాటు పాల ఉత్పత్తులైన పెరుగు, వెన్న, నెయ్యి ధరలు కూడా స్పల్పంగా పెరుగనున్నాయని కర్ణాటక పాల సమాఖ్య (కేఎంఎఫ్) ఉన్నతాధికారి ఒకరు నగరంలో సోమవారం మీడియాకు చెప్పారు. కాగా పెంచిన పాల ధర నేరుగా పాడి రైతులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పశుగ్రాసం ధరలతో పాటు రవాణా చార్జీలు కూడా పెరగడంతో పాల ధరలను లీటరుపై కనీసం రూ. 5 వరకు పెంచాలని పాలసమాఖ్యలు ప్రభుత్వానికి ప్రతిపాదన చేసిన సంగతి విదితమే. అయితే ప్రజలపై భారం పడుతుందన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం లీటరు పాలపై కేవలం రూ.3 చొప్పున పెంచేందుకు అనుమతి మంజూరు చేసింది. కాగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిపోవడంతో హోటళ్ల నిర్వహకులు కూడా టీ, కాఫీతో పాటు టిఫిన్, భోజనం రేట్లను మంగళవారం నుంచి 10 శాతం మేరకు పెంచాలని నిర్ణయించుకున్నాయి. ప్రస్తుతం టీ, కాఫీ రేటు రూ.10 నుంచి 15 వరకు ఉంది. ఇక ఈ ధరలు రూ.12 నుంచి 18 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక ఇడ్లీ ప్లేటు ధర రూ. 30 నుంచి రూ.35 వరకు ఉండగా వీటి ధరలు రూ.40 వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే భోజనం ధరలు రూ.10 నుంచి 15 రూపాయల వరకు అదనంగా పెరిగే అవకాశాలున్నాయని హోటళ్ల సంఘం వెల్లడించింది. బెంగళూరు నగరమంతటా ఈ ధరలు మంగళవారం నుంచే అమల్లోకి రానుండగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా దశలవారీగా పెరిగే అవకాశముంది. మొత్తానికి ఈ ధరాఘాతం సామాన్యులను మరింత కష్టాల్లోకి నెట్టేయనుంది.
ప్రభుత్వమే టమోటాలు అందించాలి
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో మాదిరిగానే ప్రభుత్వం ఉద్యానవనాల అభివృద్ధి శాఖ విక్రయ కేంద్రాల ద్వారా సబ్సిడీ ధరలపై టమోటా పండ్లను అందించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. హాప్‌కామ్స్ ద్వారా కిలో టమోటా కనీసం రూ.50 చొప్పున విక్రయించే ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం కిలో టమోటాల ధర హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.140 ధర పలుకుతుండగా రిటైల్ మార్కెట్‌లో ఇది కిలో రూ. 160 పలుకుతోంది. వర్షాభావ స్థితి, అనంతరం కురిసిన భారీ వర్షాల దెబ్బకు టమోటా తోటలు బాగా దెబ్బతినడంతో ధరలు కొండెక్కి కూర్చున్న సంగతి విదితమే. అల్లం ధర కిలో రూ.300 దాటేయడంతో పాటు టమోటాల ధర డబుల్ సెంచరీకి చేరువలో ఉండటంతో హోటళ్లలో వీటి వాడకాన్ని గణనీయంగా తగ్గించేశారు. ఇళ్లలో కూడా పొదుపుగా వాడుకుంటున్నారు. చింతపండు, ఎండుమిరప, వెల్లుల్లి ధరలు కూడా కిలో రూ.200 పై చిలుకే ఉన్నాయి.