Minister: ‘కరోనా’ పై ఆందోళన వద్దు
ABN , First Publish Date - 2023-04-12T09:22:12+05:30 IST
రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆ వైరస్ మునుపటిలా ఉగ్రరూపం దాల్చే పరిస్థితి
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆ వైరస్ మునుపటిలా ఉగ్రరూపం దాల్చే పరిస్థితి లేదని, అందువల్ల ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) ప్రకటించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే మంగళవారం ఉదయం ప్రధాన ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ సావధాన తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా ఈపీఎస్ మాట్లాడుతూ... రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఆ వైరస్ నిరోధక చర్యలు చేపట్టడం లేదని, ఓసారి మాస్కులు ధరించాలని, మరోసారి బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరిస్తే చాలునని ప్రకటించి ప్రజలను అయోమయానికి గురి చేస్తోందన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో జరిపినట్లు ప్రస్తుతం రాష్ట్రమంతటా ఇంటింటీకి వెళ్ళి కరోనా పరీక్షలు జరపాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం బదులిస్తూ... ఆసుపత్రుల వద్దే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు తెలియగానే రాష్ట్రమంతటా అన్ని ఆసుపత్రుల వద్ద కరోనా మాస్కులు తప్పకుండా ధరించాలని ఆదేశాలు జారీ చేశామని, రాష్టంలో కరోనా నిరోధక ముందస్తు జాగ్రత్త చర్యలు సక్రమంగా అమలు చేస్తున్నారంటూ కేంద్రమంత్రి సైతం ప్రశంసించారని చెప్పారు. మునుపటిలా కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చితే చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నామని, ఆసుపత్రుల్లో తగినంతమంది వైద్యులు, తగినన్ని మందులు, ఉపకరణాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగిన సదుపాయాలపై ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లకు తాను ప్రత్యేక ఆదేశాలు జారీ చేశానని చెప్పారు.
సోమవారం రాష్ట్రమంతటా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు అత్యవసర చికిత్సలందించే విధానాలపై మాక్‌డ్రిల్ కూడా నిర్వహించినట్లు వివరించారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిందేనని, వారంతా తప్పకుండా మాస్కులు ధరించి ఇంటిపట్టునే గడపటం మంచిదని సూచించారు. కరోనా బాధితులకు ప్రాణవాయువును సకాలంలో అందించేలా అన్ని ఆసుపత్రుల్లోనూ 2067 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను నిల్వ వుంచామని, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 500 నుండి 1000కి పెరిగితే మాస్కుధారణ తప్పనిసరిచేయాల ని వైద్యునిపుణులు చెబుతున్నారని మంత్రి గుర్తు చేశారు.