Minister M. Subramaniam: కొత్త కరోనా స్ట్రెయిన్ తీవ్రత స్వల్పమే..
ABN , First Publish Date - 2023-04-11T12:08:34+05:30 IST
రాష్ట్రంలో కొత్త కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి తక్కువగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) తెలిపారు.
పెరంబూర్(చెన్నై): రాష్ట్రంలో కొత్త కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి తక్కువగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకొనేలా రాష్ట్రప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 11 వేల ఆసుపత్రుల్లో కరోనా వార్డులను సిద్ధం చేస్తోంది. స్థానిక సెంట్రల్ రైల్వేస్టేషన్ సమీపంలో రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన కరోనా వార్డును మంత్రి సుబ్రమణ్యం సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్లస్టర్ స్థాయిలో లేదని, అక్కడక్కడా మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. అలాగే, కొత్త కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి తక్కువగానే ఉందన్నారు. ఇటీవల తీవ్రంగా వ్యాపించిన ఇన్‌ఫ్లూయింజా వ్యాధిని నియంత్రించేలా సీఎం స్టాలిన్ ఉత్తర్వులతో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించామన్నారు. పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ఈ శిబిరాల్లో ఈ జ్వరం లక్షణాలతో ఉన్న 11 వేల మందిని గుర్తించి చికిత్సలందించినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ వసతితో 33,664 పడకలతో పాటు మొత్తం 64,281 పడకలతో కరోనా ప్రత్యేక వార్డులు, 2,067 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిల్వ చేసే కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలకు 78 ప్రభుత్వ కేంద్రాలు, 264 ప్రైవేటు కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. ప్రస్తుతం కరోనా లక్షణాలున్న వారికి మాత్రమే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేపడుతున్నామన్నారు. అదే విధంగా కరోనా పరీక్షలను కూడా పెంచుతున్నట్లు మంత్రి వివరించారు.