Minister: ప్రభుత్వంతో సంప్రదించకుండా కొత్త కోర్సులకు అనుమతి వద్దు

ABN , First Publish Date - 2023-04-19T09:11:32+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా కళాశాలల్లో కొత్త కోర్సులు, పాఠ్యాంశాలకు అనుమతించరాదని

Minister: ప్రభుత్వంతో సంప్రదించకుండా కొత్త కోర్సులకు అనుమతి వద్దు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా కళాశాలల్లో కొత్త కోర్సులు, పాఠ్యాంశాలకు అనుమతించరాదని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)కి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సి.పొన్ముడి(Minister C. Ponmudi) విజ్ఞప్తి చేశారు. శాసనసభలో మంగళవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే పీఎంకే సభాపక్ష నాయకుడు జీకే మణి మాట్లాడుతూ... సేలం పెరియార్‌ విశ్వవిద్యాలయంలో కొత్త సాంకేతిక పాఠ్యాంశాన్ని ప్రారంభించారని, ఆ విషయమై ఓ ప్రైవేటు సంస్థతో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుని ఆ కోర్సుకు ఫీజును అధికంగా వసూలు చేస్తున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. అన్నా విశ్వవిద్యాలయంలో ఆ రకం టెక్నికల్‌ కోర్సు చదివేందుకు రూ.13 వేలను ఫీజుగా వసూలు చేస్తున్నారని, అయితే పెరియార్‌ విశ్వవిద్యాలయం కళాశాలలో ఆ కోర్సుకు రూ.1.5 లక్షల దాకా వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ కోర్సు చదివిన విద్యార్థులకు సరైన ఉద్యోగావకాశాలు లభించవని కూడా చెబుతున్నారని పేర్కొన్నారు. ఆ విశ్వవిద్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుపుతుండటం వల్లే తాను ఈ అంశాన్ని సభలో ప్రస్తావిస్తున్నానని జీకే మణి చెప్పారు. ఈ కొత్త కోర్సుకు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. ఇందుకు ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి సమాధానం చెబుతూ... బీటెక్‌, ఎంటెక్‌ వంటి కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి జారీ చేసే హక్కు అన్నా విశ్వవిద్యాలయానికి మాత్రమే ఉందని, తిరునల్వేలి విశ్వవిద్యాలయం(Tirunelveli University)లో ఇలాంటి ఎంటెక్‌ కోర్సును నిలిపివేసినట్లు చెప్పారు. ఈ యేడాది బీటెక్‌ కోర్సును ప్రారంభించేందుకు ఓ ప్రైవేటు కళాశాల దరఖాస్తు చేసినట్లు తెలుస్తోందని, ఈ విషయం ప్రభుత్వ దృష్టికి రాలేదన్నారు.

ఈ విషయమై మంగళవారం ఉదయం సేలం పెరియార్‌ విశ్వవిద్యాలయం నిర్వాహకులతో ఫోన్‌లో మాట్లాడగా... ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏఐసీటీఈ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు కొత్త పాఠ్యాంశాలను చేర్చేందుకు అనుమతి ఇవ్వరాదని సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. సేలం విశ్వవిద్యాలయం(Salem University)లో ఇలాంటి వివాదాస్పదమైన కోర్సుకు తావులేదని, ఆ కోర్సుకు అనుమతి ఇచ్చివుంటే రద్దు చేయాలని సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారులకు తాను ఆదేశించానని మంత్రి పొన్ముడి వివరించారు.

ఇదికూడా చదవండి: ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీ రద్దు

Updated Date - 2023-04-19T09:11:32+05:30 IST