Kota:ప్రేమ వ్యవహారం అవాస్తవం.. మంత్రి కామెంట్స్‌పై బాధితురాలి తండ్రి ఆగ్రహం
ABN , First Publish Date - 2023-09-14T21:22:42+05:30 IST
రాజస్థాన్ (Rajasthan)లోని కోటా(Kota)లో విద్యార్థుల వరుస సూసైడ్స్ వెనక ప్రేమ వ్యవహారాలు ఉన్నట్లు పేర్కొన్న ఆ రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్ వ్యాఖ్యలను పేరెంట్స్ ఖండిస్తున్నారు.
రాజస్థాన్ (Rajasthan)లోని కోటా(Kota)లో విద్యార్థుల వరుస సూసైడ్స్ వెనక ప్రేమ వ్యవహారాలు ఉన్నట్లు పేర్కొన్న ఆ రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్ వ్యాఖ్యలను పేరెంట్స్ ఖండిస్తున్నారు. ఇటీవల కోటాలోని ఓ హాస్టల్ లో 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఆమెతో సహా అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని మృతి చెందారు. వాటిని అరికట్టడానికి హాస్టళ్ల సిబ్బంది ఫ్యాన్ లకు స్ప్రింగ్ లు అమర్చడం, పై నుంచి కింద పడినా గాయపడకుండా జాలీలు ఏర్పాటు చేశారు. అయితే బాలిక మృతిపై సీఎం అశోక్ గహ్లోత్(Ashok Gahlot) తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి శాంతి ధరివాల్ వివాదాస్పద కామెంట్లు చేశారు. ఆమె మృతికి ప్రేమ వ్యవహారం కారణంగా తెలుస్తోందని మంత్రి ఆరోపించారు. అయితే బాలిక సూసైడ్ చేసుకున్న గదిలో ఎలాంటి లెటర్ లభించలేదని పోలీసులు తెలిపారు.
మంత్రి వ్యాఖ్యలకు స్పందించిన బాలిక తండ్రి రవీంద్ర సిన్హా.. ప్రేమ వ్యవహారంతోనే తన కుమార్తె ప్రాణాలు విడిచిందని మంత్రి నిరూపించాలని డిమాండ్ చేశారు. కోచింగ్ కి వచ్చిన స్టూడెంట్స్ ఆత్మహత్యలకు కచ్చితమైన కారణాన్ని కనుక్కోకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లి వచ్చే సమయంలో కోటాలోని కొందరు అబ్బాయిలు తనను ఆటపట్టించేవారని కుమార్తె ఫిర్యాదు చేసిందని ఆయన చెప్పారు. విద్యార్థులకు హాస్టల్ కల్పిస్తున్న సౌకర్యాలపైనా సిన్హా అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధితురాలు 11వ తరగతి చదువుతోందని, కోచింగ్ సెంటర్ లో నీట్ పరీక్షకు సన్నద్ధం అవుతోందని పోలీసులు తెలిపారు. బాలిక మృతితో ఈ ఏడాది కోటాలో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 23కి చేరింది.