Bridge Collapses: కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి...17 మంది కార్మికుల మృతి
ABN , First Publish Date - 2023-08-23T14:53:34+05:30 IST
మిజోరంలోని ఐజ్వాల్‌లో నిర్మాణంలో ఉన్న ఒక రైల్వే బ్రిడ్జి కుప్పకూలడంతో 17 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఐజ్వాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని సాయిరంగ్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు బుధవారం ఉదయం తెలిపారు.
ఐజ్వాల్: మిజోరం (Mizoram)లోని ఐజ్వాల్‌లో నిర్మాణంలో ఉన్న ఒక రైల్వే బ్రిడ్జి (under construction Railway bridge) కుప్పకూలడంతో 17 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఐజ్వాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని సాయిరంగ్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు బుధవారం ఉదయం తెలిపారు. నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే రైల్వే అధికారుల బృందం, జోన్ సీనియర్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రమాద సమయంలో 40 మంది కూలీలు అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. కురుంగ్ నదిపై బైరాబీని సారంగ్‌తో కలిపే రైల్వే వంతన నిర్మాణంలో ఉంది.
సీఎం సంతాపం
ఐజ్వాల్‌లో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో పలువురు దుర్మరణం చెందడంపై మిజోరం ముఖ్యమంత్రి జొరామ్‌థంగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.
ప్రధాని దిగ్భ్రాంతి
రైల్వే బ్రిడ్జి కూలిన ఘటనలో పలువురి దుర్మరణంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.