India and Sri Lanka : ఒకరి కోసం మరొకరు కలిసి పని చేద్దాం.. శ్రీలంక అధ్యక్షుడితో మోదీ..
ABN , First Publish Date - 2023-07-21T15:17:54+05:30 IST
భారత దేశం, శ్రీలంక పరస్పర భద్రతా ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పని చేయవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం చెప్పారు. ఇరు దేశాల మధ్య పెట్రోలియం లైన్, ల్యాండ్ బ్రిడ్జ్ కనెక్టివిటీ ఆచరణ సాధ్యత గురించి ఇరు దేశాలు అధ్యయనం చేస్తాయన్నారు.
న్యూఢిల్లీ : భారత దేశం, శ్రీలంక పరస్పర భద్రతా ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పని చేయవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) శుక్రవారం చెప్పారు. ఇరు దేశాల మధ్య పెట్రోలియం లైన్, ల్యాండ్ బ్రిడ్జ్ కనెక్టివిటీ ఆచరణ సాధ్యత గురించి ఇరు దేశాలు అధ్యయనం చేస్తాయన్నారు. తమిళుల ఆకాంక్షలను శ్రీలంక ప్రభుత్వం నెరవేర్చుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సమానత్వం, న్యాయం, శాంతి కోసం ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (Ranil Wickremesinghe)తో సమావేశం అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం విక్రమసింఘే శుక్రవారం న్యూఢిల్లీకి వచ్చారు. మోదీతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఓ ‘విజన్’పై అంగీకారం కుదిరిందని విక్రమసింఘే చెప్పారు.
శ్రీలంకలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల వినియోగంపై భారత్‌తో ఒప్పందం కుదిరిందని, దీనివల్ల ఫిన్‌టెక్ కనెక్టివిటి పెరుగుతుందని మోదీ చెప్పారు. తమిళనాడులోని నాగపట్టినం, శ్రీలంకలోని కంకేసంటురాయ్ మధ్య ప్యాసింజర్ ఫెర్రీ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. విక్రమసింఘే మాట్లాడుతూ, శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నపుడు భారత దేశం అందించిన సహాయానికి ధన్యవాదాలు తెలిపారు. భారత్ 2022 జనవరి-జూలై మధ్య కాలంలో తమ దేశానికి 4 బిలియన్ డాలర్లు సత్వర సాయం అందజేసిందన్నారు. భారత దేశంలోని దక్షిణ ప్రాంతం నుంచి తమ దేశానికి మల్టీ-ప్రాజెక్టు పెట్రోలియం పైప్‌లైన్‌ను నిర్మించడం వల్ల తమ దేశానికి నమ్మకమైన, అందుబాటు ధరల్లో ఉండే ఇంధన సరఫరాకు భరోసా లభిస్తుందని తాను, మోదీ విశ్వసిస్తున్నామని చెప్పారు.
గత సంవత్సరం ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాల్లో శ్రీలంకకు ఎదురైన అసాధారణ అనుభవాలను మోదీకి వివరించానన్నారు. ఈ సవాళ్లను అధిగమించడం కోసం తన ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను కూడా తెలియజేశానని చెప్పారు. తమ దేశం ఆధునిక చరిత్రలో అత్యంత తీవ్రమైన సవాలును ఎదుర్కొన్న కాలంలో భారతీయులు, భారత ప్రభుత్వం అందజేసిన సహకారానికి ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు.
అదానీతో విక్రమసింఘే భేటీ
భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీతో కూడా విక్రమసింఘే సమావేశమయ్యారు. శ్రీలంకలో అదానీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. ప్రస్తుతం అదానీ గ్రూప్ శ్రీలంకలో కంటెయినర్ టెర్మినల్‌ను, 500 మెగా వాట్ల విండ్ పవర్ ప్రాజెక్టును నిర్మిస్తోంది.
ఇవి కూడా చదవండి :
CJI : రైలు ప్రయాణంలో అసౌకర్యంపై హైకోర్టు జడ్జి ఫిర్యాదు.. హుందాగా ప్రవర్తించాలంటూ సీజేఐ లేఖ..
Manipur video : మహిళలను నగ్నంగా ఊరేగించడానికి కారణం వదంతులే : మణిపూర్ పోలీసులు