Muktar Ansari: 32 ఏళ్ల నాటి హత్య కేసులో ముఖ్తార్ అన్సారీకి యావజ్జీవం
ABN , First Publish Date - 2023-06-05T14:45:13+05:30 IST
గ్యాంగ్‌స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీకి 32 ఏళ్ల క్రితం నాటి అవదేశ్ నారాయణ్ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. వారణాసిలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు సోమవారంనాడు ఈ శిక్ష ప్రకటించింది.
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (Mukhtar Ansari)కి 32 ఏళ్ల క్రితం నాటి అవదేశ్ నారాయణ్ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష (Life sentence) పడింది. వారణాసిలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు సోమవారంనాడు ఈ శిక్ష ప్రకటించింది.
కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్ సోదరుడైన అవదేశ్ రాయ్‌ను 1991 ఆగస్టు 3న వారణాసిలో అజయ్ నివాసం వద్ద కాల్చిచంపారు. దీనిపై ముఖ్తార్ అన్సారి, తదితరులపై కేసు నమోదైంది. ఈ కేసులో ముఖ్తార్‌ను దోషిగా ప్రకటించిన కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగారవాస శిక్ష విధించినట్టు న్యాయవాది ఒకరు వారణాసిలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కోర్టు తీర్పుపై అవదేశ్ రాయ్ సోదరుడు అజయ్ రాయ్ స్పందిస్తూ, తీర్పుకోసం ఏళ్ల తరబడి తాము నిరీక్షించామని, ఇప్పటికి దీనికి ఒక ముగింపు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. తాను, తన తల్లిదండ్రులు, అవదేశ్ కుమార్త్, కుటుంబ సభ్యులంతా ఎంతో కాలంగా ఓపికగా ఎదురు చూస్తున్నామని, ప్రభుత్వాలు రావడం, వెళ్లడంతో ముఖ్తార్ మరింత బలపడుతూ వచ్చారని అన్నారు. అయినప్పటికీ తాము నిరాశపడలేదని, లాయర్ల కృషి కారణంగా తన సోదరుడి హత్య కేసులో ఇవాళ కోర్టు ముఖ్తార్‌ను దోషిగా ప్రకటించిందని చెప్పారు.