Murder accused shot dead: కోర్టు ఆవరణలో హత్యకేసు నిందితుడిని కాల్చిచంపిన దుండగులు
ABN , Publish Date - Dec 15 , 2023 | 07:37 PM
బీహార్‌లోని పాట్నా కోర్టు ఆవరణ లో శుక్రవారంనాడు దారుణం చోటుచేసుకుంది. విచారణ ఖైదీని కోర్టుకు హాజరుపరుస్తుండగా అతన్ని ఇద్దరు దుండగులు కాల్చిచంపారు. పోలీసుల కళ్లముందే ఈ దారుణం జరగడంతో ఉద్రిత్త పరిస్థితి తలెత్తింది. దుండగులు ఇద్దరినీ పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
పాట్నా: బీహార్‌లోని పాట్నా కోర్టు ఆవరణ (Patna court complex)లో శుక్రవారంనాడు దారుణం చోటుచేసుకుంది. విచారణ ఖైదీ (Undertrail)ని కోర్టుకు హాజరుపరుస్తుండగా అతన్ని ఇద్దరు దుండగులు కాల్చిచంపారు (Shot dead). పోలీసుల కళ్లముందే ఈ దారుణం జరగడంతో ఉద్రిత్త పరిస్థితి తలెత్తింది. దుండగులు ఇద్దరినీ పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
సంఘటన వివరాల ప్రకారం, సికిందర్‌పూర్ నివాసి అభిషేక్ కుమార్ అలియాస్ ఛోటే సర్కార్ హత్యాభియోగంతో పాటు పలు కేసులను ఎదుర్కొంటున్నాడు. పాట్నాలోని బేవూరు జైలులో ఉంటున్న నిందితుని శుక్రవారంనాడు దానాపూర్ కోర్టు ముందు హాజరుపరచేందుకు తీసుకువచ్చారు. ఈ సమయంలోనే ఇద్దరు వ్యక్తులు అతనిపై కాల్పులు జరపడంతో ఛాటా సర్కార్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దుండగులను ముజఫర్‌మూర్‌కు చెందిన వారిగా గుర్తించామని, హత్యకు కారణం ఏమిటనే దానిపై విచారణ జరుపుతున్నామని పాట్నా వెస్ట్ ఎస్పీ రాజేష్ కుమార్ తెలిపారు. ఘటనా స్థలి నుంచి నాలుగు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. హతుడికి ఎన్ని బుల్లెట్లు తగిలాయనేది నిర్ధారణ కావాల్సి ఉందని అన్నారు. కాగా, 2019లోనూ దానాపూర్ కోర్టు వెలుపల ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. విచారణ ఖైదీలను ఎస్కార్ట్‌తో తీసుకు వస్తున్న పోలీసు టీమ్‌పై కొందరు వ్యక్తులు దాడి చేయడంతో ఆ కాల్పుల్లో ఒక పోలీసు అధికారి మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.