Biren Singh: రాజీనామాపై సమాధానం దాటవేసిన సీఎం

ABN , First Publish Date - 2023-07-21T16:15:44+05:30 IST

మణిపూర్‌‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన పార్లమెంటును సైతం కుదిపేయడంతో శాంతి భద్రతల వైఫల్యానికి బాధ్యత వహిస్తూ సీఎం ఎన్.బైరేన్ సింగ్ రాజీనామా చేయాలనే డిమాండ్లు మరోసారి ఊపందుకున్నాయి. అయితే, రాష్ట్రంలో శాంతిభద్రతలు పునరుద్ధరించడమే తన పని అని, బాధ్యులైన వారిపై కఠిన చర్చలు తీసుకుంటామని సీఎం చెప్పారు.

Biren Singh: రాజీనామాపై  సమాధానం దాటవేసిన సీఎం

ఇంఫాల్: జాతుల మధ్య హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌‌ (Manipur)లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన పార్లమెంటును సైతం కుదిపేయడంతో శాంతి భద్రతల వైఫల్యానికి బాధ్యత వహిస్తూ సీఎం ఎన్.బైరేన్ సింగ్ (N Biren Singh) రాజీనామా చేయాలనే డిమాండ్లు మరోసారి ఊపందుకున్నాయి. అయితే, రాష్ట్రంలో శాంతిభద్రతలు పునరుద్ధరించడమే తన పని అంటూ రాజీనామా ప్రశ్నలపై సీఎం శుక్రవారంనాడు మీడియా సమావేశంలో సమాధానం దాటవేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్చలు తీసుకుంటామని చెప్పారు.


''ఈ ఘటనలో కీలక నిందితుడితో సహా నలుగురు వ్యక్తులను అరెస్టు చేశాం. నిందితులను మా ప్రభుత్వం కఠినంగా శిక్షించి తీరుతుంది'' అని బైరేన్ సింగ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వైరల్ వీడియోపై ప్రతి ఒక్కరూ ఆగ్రహంతో ఉన్నారని, మహిళలందరినీ తళ్లులు, చెల్లెళ్లగా చూసే సమాజం మనదని, ఆ కారణంగానే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్నాయని చెప్పారు. వీడియో తాను చూశానని, చాలా బాధాకరమని, ఇది మానవత్వంపై జరిగిన నేరమని అన్నారు. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. నిందితులకు మరణశిక్ష పడేలా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి దారుణ ఘటనను ఖండించాల్సి ఉంటుందన్నారు. తద్వారా సమాజంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని అన్నారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు హుయిరెమ్ హెరోడస్ ఇంటిని దుండగులు గురువారం తగులబెట్టారు. పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు గుంపుగా వచ్చి, ఈ ఇంటిని తగులబెట్టారు.

Updated Date - 2023-07-21T16:15:44+05:30 IST