Asaduddin Owaisi: నెతన్యాహు నిరంకుశుడు.. గాజాకు మోదీ మద్దతివ్వాలి..!
ABN , First Publish Date - 2023-10-15T14:59:34+05:30 IST
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ ఆసదుద్దీన్ ఒవైసీ సూటిగా స్పందించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును దెయ్యంగా, నిరంకుశుడిగా ఆయన అభివర్ణించారు. మీడియా పక్షపాత వైఖరితో కథనాలు ఇస్తోందన్నారు.
హైదరాబాద్: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం (Israel-Hamas War)పై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ ఆసదుద్దీన్ ఒవైసీ (Asadudding Owaisi) సూటిగా స్పందించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును దెయ్యంగా, నిరంకుశుడిగా ఆయన అభివర్ణించారు. మీడియా పక్షపాత వైఖరితో కథనాలు ఇస్తోందన్నారు. పాలిస్తీనా భూభాగాన్ని గత 70 ఏళ్లుగా ఇజ్రాయెల్ ఆక్రమించుకుందని, ఈ అకృత్యాలపై యావత్ ప్రపంచం మౌనంగా ఉందని దుయ్యబట్టారు.
''పాలస్తీనాకు నేను బాసటగా ఉన్నాను, ఉంటాను. ఇవాళ యుద్ధరంగంలో నిలిచిన లక్షలాది మంది గాజా సాహసవీరులకు సెల్యూట్ చేస్తున్నాను. నెతన్యాహు ఒక దెయ్యం, నిరంకుశుడు, వార్ క్రిమినల్. మనదేశంలో ఒక బాబా సీఎం ఉన్నారు. పాలస్తీనా పేరు ఎత్తిన వాళ్లపై కేసులు పెట్టండని అంటున్నారు. బాబా సీఎంజీ...నేను పాలస్తీనా పతాకం, మన భారత పతాకం ధరించడాన్ని గర్వంగా భావిస్తాను. పాలస్తీనాకు బాసటగా నేనుంటాను'' అని హైదరాబాద్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ఒవైసీ అన్నారు.
మోదీజీ...పాలస్తీనాకు బాసటగా నిలవండి
గాజా ప్రజలకు సంఘభావంగా నిలవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒవైసీ విజ్ఞప్తి చేశారు. పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న అకృత్యాలను నిలిపివేసేందుకు ప్రధాని కృషి చేయాలని కోరారు. ఇది కేవలం ముస్లింల అంశం కాదు, మానవతావాదానికి సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. 21 లక్షల మంది పేజల ప్రజలున్న గాజాలో, 10 లక్షల మందికి గూడు కూడా లేదని, యావత్ ప్రపంచం దీనిపై మౌనంగా ఉందని అన్నారు. గాజా పేద ప్రజలు చేయగలిగిన హాని ఏమిటి? దీనిపై మీడియా ఏకపక్షంగా రిపోర్టింగ్ చేస్తోందని అన్నారు. ''మీకు దురాక్రమణలు కనపడటం లేదు, అకృత్యాలు కనిపించడం లేదు'' అని మీడియాను ఒవైసీ నిలదీశారు. నార్త్ గాజా ప్రజలను తమ నివాసాలు వదిలివెళ్లమని ఇజ్రాయెల్ హెచ్చరికలపై మాట్లాడుతూ, గాజాలో తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం, ఆసుపత్రుల్లో మందులు కూడా లేవని, అలాంటి ప్రజలను నార్త్ నుంతి సౌత్ గాజా వెళ్లిపొమ్మని ఇజ్రాయెల్ ప్రభుత్వం హుకుం చేస్తోందని తప్పుపట్టారు.