Madhya Pradesh CM: ఉజ్జయినికి దూరంగా రాత్రిపూట సీఎం బస.. షాకింగ్ కారణం..
ABN , First Publish Date - 2023-12-12T21:00:14+05:30 IST
మహాదేవుడు పేరు చెప్పగానే శైవక్షేత్రాలు, వాటిలో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వరుడు గుర్తుకువస్తాడు. ఉజ్జయిని సౌత్ ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ యాదవ్ ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ ఇటీవల ఎంపిక చేసింది. ఉజ్జయినిలోనే నివాసం ఉండే మోహన్ యాదవ్ ఇక నుంచి మాత్రం రాత్రి వేళల్లో ఉజ్జయినిలో ఉండబోవడం లేదు. అదెలా? ఇందుకు కారణం ఏమిటి?.. దీనిపై ఆసక్తికరమైన విషయాలు తాజాగా తెరపైకి వచ్చాయి.
ఉజ్జయిని: మహాదేవుడు పేరు చెప్పగానే శైవక్షేత్రాలు, వాటిలో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వరుడు గుర్తుకువస్తాడు. ఉజ్జయిని సౌత్ ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ యాదవ్ (Mohan Yadav)ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ ఇటీవల ఎంపిక చేసింది. ఉజ్జయినిలోనే నివాసం ఉండే మోహన్ యాదవ్ ఇక నుంచి మాత్రం రాత్రి వేళల్లో ఉజ్జయినిలో ఉండబోవడం లేదు. అదెలా? ఇందుకు కారణం ఏమిటి?.. దీనిపై ఆసక్తికరమైన విషయాలు తాజాగా తెరపైకి వచ్చాయి.
పురాతన నమ్మకాలు ఏం చెబుతున్నాయంటే..?
ఉజ్జయిని సిటీకి మహాకాళేశ్వరుడే రాజు, ఆయనే పాలకుడు. మతపరంగా, పురాతన నమ్మకాల పరంగా ప్రజలు దీనిని బలంగా విశ్వసిస్తారు. ఆ నమ్మకం ప్రకారం ఏ ముఖ్యమంత్రి కానీ, వీఐపీ కానీ ఉజ్జయినిలో రాత్రిపూట బస చేయకూడదు. ఒకవేళ ఎవరైనా ఉజ్జయినిలో రాత్రి బస చేస్తే ఆయనకు ఏదో ఒక కీడు తప్పదు. ఉజ్జయిని నివాసి అయిన మోహన్ యాదవ్ సైతం ఇక్కడి నుంచే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నారు. మరి ఆయన పరిస్థితి ఏమిటి? దీనిపై మహాకాళ్ ఆలయ ప్రధాన పూజారి మాట్లాడుతూ, ఆయన (సీఎం) నగరవాసిగా ఉజ్జయినిలో ఉండవచ్చని, ముఖ్యమంత్రిగా కాదని అన్నారు. సింథి రాజకుటుంబానికి చెందిన వారసులు కూడా సిటీకి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటారని ఆయన వివరించారు. ఇక్కడ (ఉజ్జయిని) ఒక్క మహాకాళ్‌కు మాత్రమే 'గార్డ్ ఆఫ్ హానర్' కూడా ఉంటుందని చెప్పారు.
పురాతన కాలంలో ఒక ప్రముఖుడు ఉజ్జయిని పాలకుడిగా నియమితుడైన మరుసటి రోజే కన్నుమూశాడు. ఇదేదో శాపమని భావించిన రాజా విక్రమాదిత్య ఒక సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఉజ్జయినిలో ఎవరు పాలకుడిగా నియమితులైనా ఆయన మహాకాళేశ్వరుని సర్వాధికారిగా భావించి ఆయన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలి. మహాకాళుని ప్రతినిధిగా మాత్రమే వ్యవహరించాలి.
ఉదాహరణలూ ఉన్నాయి..
ఒక ప్రధాని కానీ, ముఖ్యమంత్రి కానీ ఉజ్జయినిలో రాత్రిపూట బస చేసి పదవులు కోల్పోయిన ఉదంతాలు సైతం లేకపోలేదు. దేశ నాలుగవ ప్రధాని మురార్జీ దేశాయ్ తన హయాంలో మహాకాళేశ్వురుని ఒకసారి దర్శించారు. ఒక రాత్రి అక్కడే బస చేశారు. అయితే ఆ మరుసటి రోజే ఆయన ప్రభుత్వం కుప్పకూలింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందట. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఉజ్జయినిలో రాత్రి బస చేశారు. ఆ తర్వాత 20 రోజులు తిరక్కుండానే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు.