Narendra Modi: వచ్చే రామనవమి అయోధ్యలోనే... రామ్‌లీలా దసరా ప్రసంగంలో మోదీ
ABN , First Publish Date - 2023-10-24T19:29:23+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు నవరాత్రి, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ పండుగ అని అభివర్ణించారు. అయోధ్యలో భవ్య రామాలయాన్ని చూసే భాగ్యం మనకు కలగనుందని, వచ్చే రామనవమి అయోధ్యలోనే జరుగుతుందని అన్నారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దేశ ప్రజలకు నవరాత్రి, విజయదశమి (Vijayadasami) శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ పండుగ అని అభివర్ణించారు. అయోధ్యలో భవ్య రామాలయాన్ని చూసే భాగ్యం మనకు కలగనుందని, వచ్చే రామనవమి అయోధ్యలోనే జరుగుతుందని అన్నారు. ఢిల్లీలోని ద్వారక సెక్టర్-10లో రామ్‌లీలా మైదాన్ (Ramlila maidan)లో మంగళవారంనాడు జరిగిన దసరా వేడుకల్లో ముఖ్య అతిథిగా మోదీ పాల్గొన్ని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, చంద్రయాన్ మిషన్ విజయవంతమైన రెండు నెలలైన ఈ ఏడాదిలోనే విజయదశమి వేడుకలు జరుపుకొంటున్నామని, విజయదశమికి సంప్రదాయబద్ధంగా 'శస్త్ర పూజ' కూడా చేస్తుంటామని చెప్పారు. భారతదేశ గడ్డపై ఆయుధాలను పూజించడం సంప్రదాయమని, భూములను ఆక్రమించుకునేందుకు ఆయుధ పూజ చేయమని, సొంతగడ్డను రక్షించుకునేందుకు చేస్తామని చెప్పారు. "మన శక్తి పూజ కేవలం మన కోసం కాదు. యావత్ ప్రపంచ సంక్షేమం కోసం'' అని అన్నారు.
అయోధ్య రామాలయం చూసే భాగ్యం మనదే..
ఇవాళ మనం చాలా అదృష్టవంతులమని, అయోధ్యలో భవ్య రామాలయాన్ని చూడబోతున్నామని మోదీ అన్నారు. వచ్చే రామనవమి అయోధ్యలో జరుగుతుందన్నారు. భవ్య రామాలయంలో రామచంద్రుని దర్శనానికి ఇక కొద్ది నెలలే మిగిలాయన్నారు. ఈ సందర్భంగా మోదీ సంప్రదాయబద్ధంగా 'ఆయుధ పూజ' నిర్వహించారు. ఈ వేడుకల్లో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమాన్ వేషధారణలో ప్రదర్శనకు సిద్ధమైన కళాకారులకు మోదీ స్వయంగా తిలకం దిద్ది, హారతి పట్టారు. 'రావణ్ దహన్'లోనూ పాల్గొన్నారు.