NIA raids: ఖలిస్థాన్ ఉగ్రవాది లఖ్‌బీర్ రోడే ఆస్తులు సీజ్..
ABN , First Publish Date - 2023-10-11T19:06:43+05:30 IST
ఖలిస్థాన్ ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ రోడే ఆస్తులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కొరడా ఝళిపించింది. పంజాబ్‌లోని మోగా సిటీలో బుధవారంనాడు జరిపిన దాడుల్లో ఆయన ఆస్తులను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది.
మోగా: ఖలిస్థాన్ ఉగ్రవాది (Khalistani terrorist) లఖ్‌బీర్ సింగ్ రోడే (Lakhbir Singh rode)ఆస్తులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కొరడా ఝళిపించింది. పంజాబ్‌లోని మోగా సిటీలో బుధవారంనాడు జరిపిన దాడుల్లో ఆయన ఆస్తులను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు విచారణ సంస్థ సిబ్బంది పంజాబ్ పోలీసులతో కలిసి రోడే పూర్వీకుల గ్రామంలో దాడులు జరిపింది. రోడేకి చెందిన 1.4 ఎకరాల ఆస్తిని స్వాధీనం చేసుకుంది.
నిషేధిత సంస్థ ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ (ISYF) అధిపతిగా ఉన్న లక్‌బీర్ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం డిజిగ్నేటెడ్ టెర్రరిస్టుగా ప్రకటించింది. ఒకప్పటి ఖలిస్థాన్ ఉద్యమ నేత జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేకు లక్‌బీర్ సింగ్ మేనల్లుడు అవుతాడు. ఇండియాలో ఆయనపై ఆయుధాలు, పేలుడు పదార్ధాల స్మగ్లింగ్, న్యూఢిల్లీలోని ప్రభుత్వ నేతలపై కుట్ర, పంజాబ్‌లో విద్వేష వ్యాప్తి వంటి పలు కేసులున్నాయి. 2021-23 మధ్య ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల్లో రోడే చురుకుగా పనిచేసినట్టు నమోదైన ఈ కేసుల్లో ఎన్ఐఏ విచారణ జరుపుతోంది.