NIA: లొంగిపోండి.. లేకపోతే ఆస్తుల జప్తు చేస్తాం..
ABN , First Publish Date - 2023-06-29T07:47:23+05:30 IST
దక్షిణకన్నడ జిల్లా బెళ్లారె బీజేపీ యువ నాయకుడు ప్రవీణ్ నెట్టారు హత్యకేసులో నిందితులు రెండు రోజుల్లో లొంగిపోకుంటే
- ప్రవీణ్ హత్య కేసు నిందితులకు ఎన్‌ఐఏ హెచ్చరిక
- రెండు రోజుల గడువు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): దక్షిణకన్నడ జిల్లా బెళ్లారె బీజేపీ యువ నాయకుడు ప్రవీణ్ నెట్టారు హత్యకేసులో నిందితులు రెండు రోజుల్లో లొంగిపోకుంటే వారికి చెందిన ఆస్తులు జప్తు చేస్తామని ఎన్‌ఐఏ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం సుళ్య, బెళ్లారె, దక్షిణకన్నడలోని పలు ప్రాంతాల్లో మైక్ ద్వారా ప్రచారం చేశారు. ఈనెల 30లోగా నిందితులు లొంగిపోవాలని, లేనిపక్షంలో ఆస్తులు జప్తు చేస్తామన్నారు. ఎన్‌ఐఏ చెన్నై విభాగం ఇన్‌స్పెక్టర్ షణ్ముగం(NIA Chennai Division Inspector Shanmugam) నేతృత్వంలో ముగ్గురు అధికారుల బృందం బెళ్తంగడి పోలీస్ స్టేషన్ పరిధిలోని పడంగడి గ్రామంలో నౌషాద్ అనే వ్యక్తి ఇంటిపై దాడులు నిర్వహించారు. నౌషాద్‌కు సంబంధించి కుటుంబ సభ్యులతో ఆరా తీశారు. ఈ కేసులో సుళ్యకు చెందిన ముస్తఫా పైచార్, అబూబకర్ సిద్ధికి, ఉమ్మర్ ఫరూక్, తుహేల్, మసూద్ అగ్నాడితోపాటు పలువురి కోసం కొడగు, దక్షిణకన్నడ జిల్లాల వ్యాప్తంగా గాలింపులు జరుపుతున్నారు. 21 మందిపై కేసు నమోదు చేయగా ఇప్పటి వరకు 16 మందిని అరెస్టు చేశారు. మిగిలిన ఐదుగురికోసం గాలిస్తున్నారు.