Nitish Kumar: నితీష్ తిరిగి ఎన్డీయేలోకి వెళ్తారా? ఊహాగానాలకు ఊతం..
ABN , First Publish Date - 2023-09-25T14:16:43+05:30 IST
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరనున్నారా?. దీనిపై కొద్దిరోజులుగా నడుస్తున్న ఊహాగానాలకు ఊతం ఇస్తూ ఆయన పాట్నాలో సోమవారంనాడు జరిగిన జనసంఘ్ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 107వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) తిరిగి ఎన్డీయే (NDA) గూటికి చేరనున్నారా?. దీనిపై కొద్దిరోజులుగా నడుస్తున్న ఊహాగానాలకు ఊతం ఇస్తూ ఆయన పాట్నాలో సోమవారంనాడు జరిగిన జనసంఘ్ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ (Pandit Deendayal Upadhyaya) 107వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో వచ్చే ఏడాది కీలకమైన లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నితీష్ రాజకీయ కదలికలు ఏవిధంగా ఉండబోతున్నాయనే దానిపై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. అయితే నితీష్ తిరిగి ఎన్డీయే గూటికి చేరుతారనే ఊహాగానాలను జేడీయూ నేతలు కొట్టిపారేస్తున్నారు. విపక్ష కూటమిని ఏకం చేయడం కోసం నితీష్ అహరహం శ్రమిస్తున్నారని, తన లక్ష్యాన్ని ఆయన సాధించితీరుతారని చెబుతున్నారు.
పండిట్ దీన్‌దయాళ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా బీహార్‌లో జరుపుకొంటున్నారు. 2020లో పాట్నా సిటీలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో దీన్‌దయాళ్ విగ్రహాన్ని నితీష్ ఆవిష్కరించారు కూడా. విగ్రహం ఏర్పాటు చేసిన పార్క్ ఏరియాలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తమ శాఖలు నిర్వహిస్తోంది. ఆర్ఎస్ఎస్ బీహార్ ప్రధానకార్యాలయం విజయ్ నికేతన్‌కు పక్కనే ఈ పార్క్ ఉంది.
ఇది ప్రభుత్వ ఫంక్షన్...
దీన్‌దయాళ్ జయంతికి వెళ్తుండటంపై మీడియా అడిగిన ప్రశ్నకు నితీష్ నవ్వుతూ సమాధానమిచ్చారు. ''మేము ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాం. ఇది ప్రభుత్వ కార్యక్రమం కావడంతో ప్రతి ఒక్కరూ వస్తారు'' అని చెప్పారు. నితీష్ వెంట ఆయన డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కూడా ఉండటం ఇక్కడ విశేషం. ఇంతకుముందు దీన్‌దయాళ్ జయంతిని రాజకీయ కార్యక్రమంగా నిర్వహించడాన్ని తేజస్వి వ్యతిరేకించారు. అయితే, సోమవారం ఈ జయంతి కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొన్నారు. తేజస్వి వైఖరిలో వచ్చిన మార్పుపై అడిగినప్పుడు, తాను ఎప్పుడూ ఈ ఈవెంట్‌ను వ్యతిరేకించలేదని సమాధానమిచ్చారు.
అసంబద్ధమైన ప్రశ్న...
ఎన్డీయేలోకి తిరిగి చేరనున్నారంటూ జరుగుతున్న చర్చపై నితీష్‌ను మీడియా తరచి తరచి ప్రశ్నించినప్పుడు, ఇది 'అసంబద్ధమైన ప్రశ్న' అని ఆయన సమాధానమిచ్చారు. విపక్షాలను ఏకతాటిపై తెచ్చేందుకు తాను పనిచేస్తున్నానని, అదొక పెద్ద అఛీవ్‌మెంట్ కానుందని చెప్పారు. ఇతరులు ఏమనుకుంటున్నారో అనే దానిని తను పట్టించుకోనని చెప్పారు.