Share News

Bihar: మద్యనిషేధంపై అధ్యయనం.. నితీశ్ కుమార్ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2023-11-27T08:45:41+05:30 IST

ఏడేళ్ల క్రితం అమలు చేసిన మద్యపాన నిషేధం(Liquor Ban)పై అధ్యయనం చేయాలని బిహార్(Bihar) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Bihar: మద్యనిషేధంపై అధ్యయనం.. నితీశ్ కుమార్ కీలక నిర్ణయం

పట్నా: ఏడేళ్ల క్రితం అమలు చేసిన మద్యపాన నిషేధం(Liquor Ban)పై అధ్యయనం చేయాలని బిహార్(Bihar) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏడేళ్ల క్రితం నితీశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. 2016 ఏప్రిల్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యపాన నిషేధంపై నిర్ణయం తీసుకున్నారు. మద్యం అంటే అసహ్యం కలిగేలా దారితీసిన అనుభవాలను నితీశ్ గుర్తు చేసుకున్నారు.

తాను ఇంజనీరింగ్ చదవిటేప్పుడు పట్నాలోని ఓ హాస్టళ్లో ఉండేవాడినని.. ఆ టైంలో ఇరుగుపొరుగు వారు మద్యం సేవించి గొడవలకు దిగేవారని చెప్పారు. ఆదివారం 'నషముక్తి దివస్' సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాలను నిషేధించడంపై రాష్ట్ర ప్రభుత్వం ఏటా నషముక్తి దివస్(Nashamukthi Diwas) నిర్వహిస్తోందన్నారు. యువత మత్తు పదార్థాలతో జీవితాల్ని నాశనం చేసుకోకూడదనే ఆలోచనతో ఏడేళ్ల క్రితం రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించామని తెలిపారు.


జనతా పార్టీ నాయకుడిగా 1970లో సీఎంగా ఉన్న కర్పూరి ఠాకూర్ పాలనలో మద్య నిషేధంతో రాష్ట్రంలో మార్పులు రావడం తాను గమనించానన్నారు. కానీ ప్రభుత్వం రెండేళ్ల కంటే ఎక్కువ కాలం నడవలేని స్థితికి చేరడంతో తరువాతి కాలంలో మద్యపాన నిషేధాన్ని రద్దు చేసినట్లు గుర్తు చేశారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని 2016 ఏప్రిల్ లో రెండేళ్ల పాటు రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేసినట్లు తెలిపారు.

2018లో ఓ సర్వే నిర్వహించామని అందులో సానుకూల ఫలితాలు వచ్చినట్లు గుర్తు చేశారు. మద్యపాన నిషేధంతో ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయని, పిల్లలకు మెరుగైన విద్య అందినట్లు సర్వేలో తేలిందని వివరించారు. ఆదా చేస్తున్న డబ్బు నిత్యావసరాలకు ఉపయోగపడిందని చెప్పారు.

అంతేకాకుండా.. రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిదని పేర్కొన్నారు. అప్పటి సర్వే ఫలితాల ఆధారంగా మద్య నిషేధంపై మరో సారి అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. సర్వే రిపోర్టుకి అనుగుణంగా దీనిపై మళ్లీ ఆలోచిస్తామని స్పష్టం చేశారు.

Updated Date - 2023-11-27T08:45:43+05:30 IST