Nitish Kumar: ఇండియా కూటమి మీటింగ్‌కి హాజరుకావట్లేదన్న వదంతులపై మండిపడ్డ నితీశ్.. ఆయన ఏమన్నారంటే?
ABN , First Publish Date - 2023-12-06T16:01:15+05:30 IST
ప్రతిపక్ష ఇండియా కూటమి(INDIA Alliance) ఏర్పాటు చేసే మీటింగ్ కి తాను హాజరుకావట్లేదంటూ వస్తున్న వదంతులను బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ఖండించారు.
పట్నా: ప్రతిపక్ష ఇండియా కూటమి(INDIA Alliance) ఏర్పాటు చేసే మీటింగ్ కి తాను హాజరుకావట్లేదంటూ వస్తున్న వదంతులను బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ఖండించారు. నిన్న జరగాల్సిన ఇండియా కూటమి సమావేశం డిసెంబర్ 17కు వాయిదా పడింది.
ఇదే అంశంపై నితీశ్ మాట్లాడుతూ... తాను జ్వరంతో బాధపడుతున్నందువల్ల ప్రతిపక్షాల సమావేశానికి హాజరుకాలేకపోయానని తెలిపారు. నితీశ్ బుధవారం ఢిల్లీలో జరగాల్సిన కూటమి సమావేశానికి హాజరుకావట్లేదంటూ పలు జాతీయ మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలు అర్థం లేనివని.. నాన్సెన్స్ అంటూ కొట్టిపడేశారు.
"నేను ఇండియా కూటమి మీటింగ్‌కు హాజరు కాలేనని పుకార్లు వచ్చాయి. ఇది నాన్సెన్స్. ఆ సమయంలో నాకు జ్వరం వచ్చింది. తదుపరి సమావేశం ఎప్పుడు జరిగినా, నేను తప్పకుండా వెళ్తాను" అని నితీశ్ అన్నారు. ఆయనకు బదులుగా సీనియర్ నేతలు జేడీ(యూ) చీఫ్ లాలన్ సింగ్, బీహార్ జలవనరుల శాఖ మంత్రి సంజయ్ కుమార్ ఝా హాజరవుతారని గతంలో వార్తలు వచ్చాయి.
2024 ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమిని ఢీ కొట్టడంలో భాగంగా ఎన్నికల వ్యూహాన్ని రచించేందుకు కాంగ్రెస్ తో కూడిన ప్రతిపక్షాలు ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే పలు కారణాల వల్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తో సహా పలువురు నేతలు సమావేశానికి హాజరుకాకపోవడంతో మీటింగ్ వాయిదా పడింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో బీజేపీ ఘన విజయం సాధించడంతో ప్రతిపక్ష కూటమిలో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ను గద్దె దింపి కాస్తంతా స్వాంతన పొందింది కాంగ్రెస్ పార్టీ. ఈ పరిణామాలే ఇండియా కూటమి భవిష్యత్తును అగమ్యగోచరంలో పడేశాయి.