Opposition Unity: నవీన్ పట్నాయక్‌ను కలిసిన నితీష్.. వీరు ఏమన్నారంటే..?

ABN , First Publish Date - 2023-05-09T15:59:36+05:30 IST

భువనేశ్వర్: లోక్‌సభ ఎన్నికలకు ముందే విపక్షాల ఐక్యతకు కొద్దికాలంగా ప్రయత్నాలు సాగిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్ ను మంగళవారంనాడు కలుసుకున్నారు. భువనేశ్వర్‌లో ఉభయులూ సమావేశమయ్యాయి.

Opposition Unity: నవీన్ పట్నాయక్‌ను కలిసిన నితీష్.. వీరు ఏమన్నారంటే..?

భువనేశ్వర్: లోక్‌సభ ఎన్నికలకు ముందే విపక్షాల ఐక్యతకు (Opposition Unity) కొద్దికాలంగా ప్రయత్నాలు సాగిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ (Nitish Kuamar).. ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్ (Naveen Patnaik)ను మంగళవారంనాడు కలుసుకున్నారు. భువనేశ్వర్‌లో ఉభయులూ సమావేశమయ్యాయి. ఇటీవలే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో నితీష్, ఆయన డిప్యూటీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సమావేశమయ్యాయి. మమతా బెనర్జీ సైతం కొద్ది రోజుల క్రితం నవీన్ పట్నాయక్‌తో సమావేశమయ్యారు.

కాగా, నితీష్, నవీన్ పట్నాయక్ సమావేశంలో రాజకీయ చర్యలపై కాకుండా ఉభయుల మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలపై ముచ్చటించుకున్నట్టు తెలుస్తోంది. సమావేశానంతరం మీడియాతో పట్నాయక్ మాట్లాడుతూ, చాలా ఏళ్లుగా తామిద్దరూ మంచిమిత్రులమని, తమ మధ్య సంభాషణల్లో పొత్తులకు సంబంధించిన ప్రస్తావన రాలేదని చెప్పారు. నవీన్ పట్నాయక్ మొదట్నించీ ఇటు కాంగ్రెస్‌కు, అటు బీజేపీకి సమదూరం పాటిస్తున్నారు. కేంద్రంలో ఎవరు ప్రభుత్వంలో ఉన్నా వారితో మైత్రి సంబంధాలు నెరపుతున్నారు. అయినప్పటికీ నితీష్ కుమార్‌తో ఉన్న సుహృద్భావ సంబంధాల రీత్యా ఆయనను కలుసుకునేందుకు అంగీకరించారు. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో ఈ ఇద్దరూ క్యాబినెట్ సహచరులుగా ఉన్నారు.

విపక్ష నేతలతో గ్రాండ్ మీటింగ్...

కాగా, అన్ని విపక్ష పార్టీల నేతలతో మే 18న ఢిల్లీలో భారీ సమావేశానికి నితీష్ కుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సమావేశానికి నవీన్ పట్నాయక్ హాజరుపై నితీష్ పెద్దగా ఆశలు పెట్టుకోనప్పటికీ, బీజేపీ వ్యతిరేక కూటమి వైపు పట్నాయక్‌ను తీసుకురాగలననే ఆశాభావంతో ఉన్నారు. కాగా, విపక్ష నేతల సమావేశం పాట్నాలో జరపాలని నితీష్ కుమార్ ఇటీవల తనను కలిసిన సందర్భంగా మమతా బెనర్జీ సూచించారు.

మరోవైపు, విపక్ష ఐక్యతా ప్రయత్నాలలో భాగంగా ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరేలను ఈనెల 11న నితీష్ కలుసుకోనున్నారు. ఇప్పటికే నితీష్ పలువురు నేతలను కలుసుకున్నారు. వీరిలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సైతం బీఆర్ఎస్‌ను జాతీయ స్థాయికి తీసుకు వెళ్లే సంకల్పంతో రాష్ట్రాల్లో పర్యటిస్తూ గత ఆగస్టులో నితీష్ కుమార్‌ను కలుసుకున్నారు. కాంగ్రెస్ సారథ్యంలోని సంకీర్ణ కూటమిలో చేరాలనే ఆలోచనకు ఆయన సుముఖంగానే ఉన్నప్పటికీ, రాహుల్ గాంధీని కూటమి నేతగా ప్రాజెక్ట్ చేసే విషయంలో ఆయనకు అభ్యంతరాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-05-09T15:59:36+05:30 IST