Deve Gowda: బీజేపీతో పొత్తు ప్రశ్నే లేదు.. తెగేసి చెప్పిన మాజీ ప్రధాని

ABN , First Publish Date - 2023-07-25T15:01:33+05:30 IST

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో జనతాదళ్ సెక్యులర్ పొత్తు పెట్టుకోనుందనే ఊహాగానాలను జేడీఎస్ సుప్రీం, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ తోసిపుచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు.

Deve Gowda: బీజేపీతో పొత్తు ప్రశ్నే లేదు.. తెగేసి చెప్పిన మాజీ ప్రధాని

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ (BJP)తో జనతాదళ్ సెక్యులర్ (JDS) పొత్తు పెట్టుకోనుందనే ఊహాగానాలను జేడీఎస్ సుప్రీం, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ (HD Deve Gowda) తోసిపుచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతే ఏయే సెగ్మంట్లలో పార్టీ బలంగా ఉందో అక్కడ తమ అభ్యర్థులను జేడీఎస్ నిలబెడుతుందని తెలిపారు. తమ పార్టీ ఐదు, ఆరు, మూడు, రెండు, కనీసం ఒక సీటు గెలిచినా ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తుందని మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ దేవెగౌడ చెప్పారు.


దీనికి ముందు, దేవెగౌడ తనయుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ, బీజేపీతో జేడీఎస్ కలిసి పనిచేయడం విషయంలో నిర్ణయాధికారం తనకే దేవెగౌడ అప్పగించారని చెప్పారు. అయినా, లోక్‌సభ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని చెప్పారు. ''అసెంబ్లీ లోపల, బయట కూడా బీజేపీ, జేడీఎస్ రెండూ విపక్షాలే. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సహజసిద్ధంగా ఒకేవిధమైన ఆందోళన ఉంటుంది. పరస్పర సహకారంతో ముందుకు వెళ్లే అంశంపై జేడీఎస్ కౌన్సిల్ పార్టీ సమావేశంలోనూ ఎమ్మెల్యేలు ఇటీవల చర్చించారు'' అని చెప్పారు.


ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనుకుంటున్నారు: డీకే

కాగా, బీజేపీ, జేడీఎస్ కలిసి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం ఆరోపించారు. ఇందుకోసం వారు రాజకీయ వ్యూహరచన చేస్తున్నారని, స్వలాభం కోసం వారు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించవని చెప్పారు. తమ ప్రభుత్వం చాలా పటిష్టంగా, స్థిరంగా ఉందని అన్నారు.

Updated Date - 2023-07-25T15:04:39+05:30 IST