Supreme Court: చిన్న కేసు, పెద్ద కేసు అనేది ఉండదు, ప్రతీదీ ముఖ్యమే: సీజేఐ
ABN , First Publish Date - 2023-02-04T20:30:01+05:30 IST
కోర్టులకు ఏ కేసు వచ్చినా అది చిన్నదా, పెద్దదా అనేది ఉండదని, ప్రతి కేసు ముఖ్యమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డైవై చంద్రచూడ్ ..
న్యూఢిల్లీ: కోర్టులకు ఏ కేసు వచ్చినా అది చిన్నదా, పెద్దదా అనేది ఉండదని, ప్రతి కేసు ముఖ్యమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) డివై చంద్రచూడ్ (DY Chandrachud) అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా సుప్రీంకోర్టు 3 లక్షలు కేసుల విచారణ జరిపిందని తెలిపారు. సుప్రీంకోర్టు 73వ వార్షికోత్సవం సందర్భంగా శనివారంనాడిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీజేఐ మాట్లాడుతూ, కేసు చిన్నదైనా, పెద్దదైనా ప్రతి కేసు ముఖ్యమేనని, చిన్న కేసులు, రొటీన్ కేసుల విషయంలోనూ పౌరుల ఇబ్బందులు ముడిపడి ఉంటాయని చెప్పారు. అలాంటి కేసుల విషయంలోనూ కోర్టులు సహజమైన రాజ్యాంగ బాధ్యతలను, అనివార్యతలను గుర్తించి పనిచేయాల్సి ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుందరేష్ మీనన్ కూడా హాజరయ్యారు. 'మారుతున్న ప్రపంచంలో న్యాయవ్యవస్థ పాత్ర' అనే అంశంపై ఆయన మాట్లాడారు.
కాగా, ప్రజలకు చేరువయ్యేందుకు కోర్టులు ఏ విధంగా కొత్తకొత్త టెక్నిక్‌లు అలవరచుకోవాలో సీజేఐ వివరిస్తూ, ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి కాలలో 2020 మార్చి 23 నుంచి 2022 అక్టోబర్ 31 వరకూ సుప్రీంకోర్టు 3.37 లక్షల కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేసిందని చెప్పారు. ఏ మారుమూల నుంచైనా హైబ్రిడ్ తరహాలో కోర్టు ప్రొసీడింగ్స్ ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పారు. ఇటీవల బడ్జెట్ ఈ-కోర్టుల ప్రాజెక్ట్ ఫేజ్-3 కోసం రూ.7,000 కోట్లు ప్రకటించిందని చెప్పారు. ఇందువల్ల న్యాయ సంస్థలతో అనుసంధానం మరింత సులభమవుతుందని, తీర్పులు మరింత త్వరగా వెలువడేందుకు, సత్వర న్యాయం జరిగేందుకు వీలుంటుందని అన్నారు. ఇలాంటి ప్రయత్నాల ద్వారా దేశంలోని ప్రతి ఒక్క పౌరునికి న్యాయం అందుబాటులో రావాలనే ఆశయం నెరవేరుతుందని చెప్పారు. మరణశిక్షలు విధించే విషయంలోనూ దానితో ముడిపడిన పలు అంశాలను న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రెండు రోజుల తర్వాత 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ఏర్పాటైందని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి సేవలందిస్తూ, ప్రజాకోర్టులకు నిజమైన నిర్వచనంగా నిలుస్తోందన్నారు