Ajit Pawar: నాకు ఆ పదవి ఇష్టం లేదని తెగేసి చెప్పిన అజిత్ పవార్
ABN , First Publish Date - 2023-06-21T20:22:24+05:30 IST
శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లో ఇటీవల తలెత్తిన లుకలుకలన్నీ సద్దుమణిగాయని అనుకుంటున్న తరుణంలో మరో కీలక పరిణామం చేటుచేసుకుంది. తనకు అసెంబ్లీలో ఎన్సీపీ విపక్ష నేత పదవిపై ఆసక్తి లేదని, పార్టీ బాధ్యత అప్పగించమని అధిష్ఠానాన్ని పవార్ మేనల్లుడు, ఎన్‌సీపీ కీలక నేత అజిత్ పవార్ కోరారు.
ముంబై: శరద్ పవార్ (Sharad pawar) సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో ఇటీవల తలెత్తిన లుకలుకలన్నీ సద్దుమణిగాయని అనుకుంటున్న తరుణంలో మరో కీలక పరిణామం చేటుచేసుకుంది. తనకు అసెంబ్లీలో ఎన్సీపీ విపక్ష నేత పదవిపై ఆసక్తి లేదని, పార్టీ బాధ్యత అప్పగించమని అధిష్ఠానాన్ని పవార్ మేనల్లుడు, ఎన్‌సీపీ కీలక నేత అజిత్ పవార్ (Ajit Pawar) కోరారు. విపక్ష నేత బాధ్యత నుంచి తనను రిలీవ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ ఆర్గనైజేషన్‌లో తనకు బాధ్యత అప్పగించాలని, ఏ బాధ్యత ఇచ్చినా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ముంబైలో బుధవారంనాడు జరిగిన ఎన్‌సీపీ 24వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన ఈ విజ్ఞప్తి చేశారు.
''నేను ఎప్పుడూ అసెంబ్లీలో విపక్ష నేతగా పనిచేసేందుకు ఇష్టపడలేదు. అయితే పార్టీ ఎమ్మెల్యేల డిమాండ్ కారణంగానే ఆ పదవిని అంగీకరించాను. విపక్ష నేత పదవికి రాజీనామా ఇవ్వాడానికి సిద్ధంగా ఉన్నాను. పార్టీ ఆర్గనైజేషన్‌లో ఏ పదవి ఇచ్చినా ఫరవాలేదు. నాకు అప్పగించిన బాధ్యతకు పూర్తి న్యాయం చేస్తాను'' అని అజిత్ పవార్ పేర్కొన్నారు. కాగా, ఆయన (అజిత్ పవార్) విజ్ఞప్తిపై ఎన్సీపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పవార్ చెప్పారు.
శివసేనలో తిరుగుబాటు కారణంగా మహావికాస్ అఘాడి ప్రభుత్వం కుప్పకూలడం, ఆ తర్వాత షిండే సారథ్యంలోని శివసేన-బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత జూలైలో అజిత్ పవార్ అసెంబ్లీలో ఎన్సీపీ విపక్ష నేతగా బాధ్యతలు తీసుకున్నారు. ఆసక్తికరంగా, ఇటీవల ఎన్‌సీపీలో కీలక బాధ్యతలను శరద్ పవార్ ప్రకటించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తన కుమార్తె, పార్లమెంటు సభ్యురాలు సుప్రియా సులే, మరో సీనియర్ నేత ప్రఫుల్ పటేల్‌ను ప్రకటించారు. అజిత్ పవార్‌కు మాత్రం ఎలాంటి పార్టీ బాధ్యతలు అప్పగించ లేదు. శరద్ పవార్ నిర్ణయంతో అజిత్ పవార్ అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వచ్చినప్పటికీ అజిత్ మాత్రం వాటిని కొట్టివేశారు. కొత్తగా పార్టీ బాధ్యతలు చేపట్టిన సుప్రియా సులే, ప్రఫుల్ పటేల్‌కు అభినందనలు సైతం తెలిపారు.