Odisha Train Tragedy: మత సామరస్యం దెబ్బతీసేలా రూమర్లు ప్రచారం చేస్తే కఠిన చర్యలు:పోలీసులు

ABN , First Publish Date - 2023-06-05T13:22:04+05:30 IST

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ఒడిశా పోలీసులు స్పందించారు. మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా విధంగా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Odisha Train Tragedy: మత సామరస్యం దెబ్బతీసేలా రూమర్లు ప్రచారం చేస్తే కఠిన చర్యలు:పోలీసులు

భువనేశ్వర్: వందల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు బలిగొన్న ఒడిశా రైలు ప్రమాదం దేశాన్ని ఓ కుదుపు కుదుపు కుదిపేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 275మంది ప్రాణాలు కోల్పోగా..వందలాది మంది క్షతగాత్రులయ్యారు. అయితే ప్రమాద ఘటనపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఒక మతానికి, లేదా ఒక వర్గానికి ఆపాదించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దుర్ఘటన జరిగిన ప్రాంతంలో ఓ మతానికి సంబంధించిన నిర్మాణానికి లింక్ చేస్తూ పెట్టిన పోస్టులు దర్శనమిస్తున్నాయి. మరిన్ని పోస్టుల ద్వారా వదంతులు వ్యాపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దుష్ప్రచారాన్ని ఒడిశా పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా విధంగా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రైలు ప్రమాద ఘటనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఒడిశా పోలీసులు ఆదివారం ట్వీట్ చేశారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ప్రమాద ఘటనకు మతం రంగు పులుముతున్నారని, ఇది దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను మానుకోవాలని సూచించారు. రైలు ప్రమాదంపై మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసేలా సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్‌లు పెడితే కఠిన చర్యలు తప్పవన్నారు. రైలు ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న ఓ నిర్మాణాన్ని ఒక నిర్దిష్ట కమ్యూనిటీతో లింక్ చేస్తూ అనేక సోషల్ మీడియా కొందరు పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఒడిశా పోలీసులు ప్రకటన చేశారు.

మరోవైపు ఒడిశా రైలు ప్రమాద ఘటనపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం ప్రకటన చేశారు. ప్రమాదఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేయడంతో కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. రైల్వేమంత్రి అకోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు మెయిన్ లైన్‌లో సిగ్నల్ ఇచ్చినట్టే ఇచ్చి వెంటనే ఆఫ్ చేశారని, దీంతో రైలు లూప్‌లైన్‌లో దూసుకుపోయి గూడ్స్ రైలును ఢీకొట్టిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాగా.. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం ఘటనలో ఇప్పటివరకు 275 మంది మృతిచెందినట్లు ఒడిశా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరో 1100 మంద్రి క్షతగాత్రులైనట్లు తెలిపింది.

Updated Date - 2023-06-05T13:36:49+05:30 IST