Odisha train accident: మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు: మమతా బెనర్జీ

ABN , First Publish Date - 2023-06-05T19:41:13+05:30 IST

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సైతం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.

Odisha train accident: మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు: మమతా బెనర్జీ

కోల్‌కతా: ఒడిశా (Odisha)లోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో (Train accident) మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రకటించారు. ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సైతం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. మంగళవారం మరోసారి కటక్, భువనేశ్వర్‌ వెళ్తున్నానని, ప్రమాదంలో గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కలుసుకుంటానని చెప్పారు. రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు బుధవారంనాడు ఎక్స్‌గ్రేషియాతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని మమతా బెనర్జీ తెలిపారు.

రైలు ప్రమాదంలో గాయపడిన పశ్చిమబెంగాల్‌కు చెందిన 206 మంది ప్రస్తుతం ఒడిశాలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు ఆమె తెలిపారు. కటక్ ఆసుపత్రుల్లో 33 మంది పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్పారు. క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులకు చేయగలిగినంత సాయంం చేస్తానని అన్నారు.

సీబీఐ దర్యాప్తుపై...

బాలాసోర్ ఘటనపై సీబీఐ దర్యాప్తు రైల్వే బోర్డు కోరడంపై అడిగిన ప్రశ్నకు మమతా బెనర్జీ సమాధానం ఇస్తూ, ప్రమాద ఘటనపై రాజకీయాలు చేయడం తనకు ఇష్టం లేదని, ప్రజలకు నిజం ఏమిటో తెలియాలని తాను కోరుకుంటున్నామని, నిజాన్ని అణిచివేసేందుకు ఇది సమయం కాదని అన్నారు.

కాగా, ముందస్తు షెడ్యూల్ ప్రకారం మమతా బెనర్జీ నాలుగు రోజుల పాటు డార్జిలింగ్ వెళ్తాల్సి ఉండగా చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసుకున్నారు. రైలు ప్రమాదంలో గాయపడిన బెంగాల్ ప్రయాణికుల చికిత్స, సహాయ కార్యక్రమాలను సమీక్షించేందుకు ఆమె తన పర్యటన రద్దు చేసుకున్నట్టు టీఎంసీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2023-06-05T20:11:47+05:30 IST