Odisha Train Accident : కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ మృతి.. డేటా లాగర్ విశ్లేషణపై ఎన్నో సందేహాలు
ABN , First Publish Date - 2023-06-04T22:21:51+05:30 IST
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాందలో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్ జి మొహంతి భువనేశ్వర్‌లో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. అసిస్టెంట్ లోకోపైలట్ ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.
ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 290కి చేరింది. వందల సంఖ్యలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ జి మొహంతి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ప్రమాదానికి కారణం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ కారణమని మొదట వార్తలొచ్చాయి. విచారణ చేపట్టిన రైల్వే బోర్డు ఘటనకు ఆయన కారణం కాదని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే రైలును ముందుకు నడిపాడని క్లీన్ చీట్ ఇచ్చింది.
ఈ ప్రమాదంలో లోకోపైలట్ జి మొహంతి రెండు కాళ్లు తెగిపడ్డాయి. భువనేశ్వర్‌లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మొహంతి ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. కాగా అసిస్టెంట్ లోకోపైలట్ ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. లోకో పైలట్ మృతితో డేటా లాగర్ సిమ్యులేషన్ సాక్ష్యంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదానికి గురైన మరో రెండు రైళ్లలోని లోకో పైలట్లు సురక్షితంగా ఉన్నారు.
కాగా.. ప్రమాద ఘటనపై సోషల్ మీడియాలో ఆడియో వైరల్ కావడం సంచలనంగా మారింది. ఇద్దరు రైల్వే అధికారుల మధ్య జరిగిన సంభాషణ ఆ ఆడియోలో ఉంది. సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో ట్రాఫిక్ సీఎస్‌వోగా(CSO (traffic)South Eastern railway ) అశోక్ అగర్వాల్(Ashok Agarwal) వాయిస్‌తో ప్రమాద ఘటనకు సంబంధించిన సంచలన విషయాలు ఈ ఆడియో ద్వారా బయటపడ్డాయి. ఈ ఆడియోలో ప్రమాద ఘటనకు సంబంధించిన నివేదిక విషయంలో అనుమానాలను వ్యక్తం చేస్తూ ఆ ఇద్దరు రైల్వే అధికారులు మాట్లాడుకున్నారు. ఘటన జరిగిన తీరుకు నివేదిక కొంచెం విరుద్ధంగా ఉందని ఓ అధికారి అనుమానం వ్యక్తం చేయగా.. అశోక్ అగర్వాల్ నివేదికలో స్పష్టత లేదని చెప్పారు.
తాజా సమాచారం ప్రకారం 290 మంది ప్రాణాలు కోల్పోయారు. 56 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, 747 మంది ప్రయాణికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.