Odisha train accident: ఒడిశా ఘోర ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిల్

ABN , First Publish Date - 2023-06-04T14:33:38+05:30 IST

ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర దుర్ఘటనపై సుప్రీంకోర్టులో అదివారంనాడు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి సారథ్యంలో నిపుణుల కమిటీతో విచారణ జరపించాలని కోరుతూ ఈ పిల్ దాఖలైంది.

Odisha train accident: ఒడిశా ఘోర ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిల్

న్యూఢిల్లీ: ఒడిశా (Odisha)లోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర దుర్ఘటనపై సుప్రీంకోర్టులో (Supreme Court) అదివారంనాడు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (PIL) దాఖలైంది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి సారథ్యంలో నిపుణుల కమిటీతో విచారణ జరపించాలని కోరుతూ ఈ పిల్ దాఖలైంది. ప్రజా భద్రతకు హామీ కల్పిస్తూ తక్షణం రైల్వే శాఖ ఆటోమాటిక్ ట్రైన్ ప్రొటక్షన్ (ATP) సిస్టమ్ (Kavach) అమలు చేసేందుకు తగిన మార్గదర్శకాలు, ఆదేశాలు జారీ చేయాలని ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కోరింది. న్యాయవాది విశాల్ తివారీ ఈ పిల్ వేశారు. బాలాసోర్ ప్రమాదంలో ఇంతవరకూ 288 మంది మృతిచెందగా, 1000 మందికి పైగా గాయపడ్డారు.

''సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నాయకత్వంలో నిపుణుల కమిటీని తక్షణం ఏర్పాటు చేయాలి. అందులో సాంకేతిక నిపుణులను కూడా చేర్చాలి. ప్రస్తుత రైల్వే వ్యవస్థలో ఉన్న ప్రమాదాలు, భద్రతా ప్రమాణాల స్థాయిని అంచనా వేసి, రైల్వే సేఫ్టీ యంత్రాగాన్ని పటిష్టం చేసేందుకు తగిన సూచనలు ఇవ్వాలి. రెండు నెలల్లోగా అత్యున్నత న్యాయస్థానానికి నివేదిక అందించేలా చూడాలి'' అని పిటిషనర్ కోరారు.

'కవచ్' వ్యవస్థ, పని తీరు..

ట్రెయిన్ కొలీజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (టీసీఏసీ)ని 2011-12లో అమలులోకి తెచ్చారు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనికి 'కవచ్' అనే పేరు పెట్టారు. రైలు ప్రమాదాలను పూర్తిగా నివారించడం (జీరో యాక్సిడెంట్స్) కోసం ఈ సిస్టమ్‌ను ఉద్దేశించారు. భద్రత, విశ్వసనీయత ప్రమాణాల్లో ఈ 'కవచ్' సిస్టమ్ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. రెడ్ సిగ్నల్ పడినప్పుడు ముందుకు వెళ్లకుండా నిరోధించడం, అతి వేగాన్ని నిరోధించేందుకు ఆటోమేటిక్‌గా బ్రేక్స్ వేయడం, లెవల్ క్రాసింగ్ సమీపించినప్పుడు ఆటోమేటిక్‌గా హార్న్ మోగించడం, రెండు కవచ్ రక్షణ వ్యవస్థలున్న రైళ్లు ఢీకొనకుండా నివారించడం, అత్యవసర పరిస్థితిలో ఎస్ఓఎస్ మెసేజ్‌లు పంపడం వంటి కీలకఫైన ఫీచర్స్ కవచ్ వ్యవస్థలో ఉంటాయి. రైళ్లలోని బ్రేక్స్‌ను నియంత్రించడం, డ్రైవర్లను అప్రమత్తం చేయడం ఉంటుంది. ట్రెయిన్ డ్రైవర్ ఎప్పుడైనా సిగ్నల్ జంప్ చేస్తే అది అత్యవసర హెచ్చరికను ప్రసారం చేస్తుంది. పొగమంచు ఉన్నప్పుడు కూడా ఈ వ్యవస్థ పూర్తి కచ్చితత్వంతో పనిచేస్తుంది. దేశంలోని రైలు మార్గాల మొత్తం పొడవు 68,000 కిలోమీటర్లని, 1,455 కిలోమీటర్ల మేర మాత్రమే ప్రస్తుతం కవచ్ వ్యవస్థ ఏర్పడిందని చెబుతున్నారు. 3,000 కిలోమీటర్ల రైలు మార్గంలో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఆ ప్రకారం చూస్తే, రైల్వే మార్గాలన్నింటిలో కవచ్ సిస్టమ్ రావాలంటే ఏళ్లు పట్టవచ్చని అంచనా.

Updated Date - 2023-06-04T14:33:38+05:30 IST