Omni bus: దక్షిణ జిల్లాలకు ఆమ్నీ బస్సులు, రైళ్ల రద్దు...
ABN , Publish Date - Dec 19 , 2023 | 12:47 PM
దక్షిణ జిల్లాల్లో ప్రస్తుతం భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆ ప్రాంతాలకు ఆమ్నీ బస్సు(Omni bus) సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు

ప్యారీస్(చెన్నై): దక్షిణ జిల్లాల్లో ప్రస్తుతం భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆ ప్రాంతాలకు ఆమ్నీ బస్సు(Omni bus) సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తమిళనాడు(Tamil Nadu) ఆమ్నీ బస్సుల యజమానుల సంఘం ప్రకటించింది. చెన్నై నుంచి ప్రతిరోజు తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి, కన్నియాకుమారి తదితర జిల్లాలకు 300కు పైగా ఆమ్నీ బస్సులు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈ నాలుగు జిల్లాల్లో ఆదివారం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. తిరునల్వేలి నుంచి తిరుచెందూర్ వరకు ప్రధాన రహదారిలో వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితి యథాతథ స్థితికి వచ్చే వరకు దక్షిణ జిల్లాలకు ఆమ్నీ బస్సులు నడపడం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆ సంఘ నిర్వాహకులు తెలిపారు.
రైళ్ల రద్దు...
భారీవర్షాల కారణంగా చెన్నై నుంచి మదురై వరకే రైళ్లను నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. మదురై నుంచి ఇతర ప్రాంతాలకు వరద ప్రవాహం కారణంగా రైళ్లు నడపలేని పరిస్థితి నెలకొందని రైల్వే అధికారులు తెలిపారు. ఎగ్మూర్ నుంచి సోమవారం ఉదయం 9.40 గంటలకు కొల్లం వెళ్లాల్సిన గురువాయూర్ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు చేశారు. అదే విధంగా, మధ్యాహ్నం 3 గంటకు తిరునల్వేలికి బయల్దేరాల్సిన వందేభారత్‌ను కూడా రద్దు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఈ రైలును తిరునల్వేలి స్టేషన్‌లోనే నిలిపివేశారు. సాయంత్రం 4.05 గంటలకు ఎగ్మూర్ నుంచి బయల్దేరాల్సిన తిరుచెందూర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఇరువైపులా రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే తెలియజేసింది.
